Microsoft: ఉద్యోగం వదిలేస్తే భారీగా డబ్బులు.. మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ పూర్తి లెక్కలు ఇదే
పూర్తి లెక్కలు ఇదే
Microsoft: ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల కోసం ఒక సరికొత్త వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్‌ను ముందుకు తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న తరుణంలో, కంపెనీ తన నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. లెవల్ 70 లేదా అంతకంటే తక్కువ స్థాయిలో పని చేస్తున్న అర్హులైన ఉద్యోగుల అధికారిక ఈమెయిల్‌కు ఈ ఆఫర్ లింక్ పంపారు. డిసెంబర్ 1, 2026 వరకు గడువు ఉన్న ఈ ఆఫర్‌ను ఎంచుకునే వారికి కంపెనీ కేవలం ఖాళీ చేతులతో పంపకుండా భారీ ఆర్థిక ప్యాకేజీని అందిస్తోంది.
నగదు పరిహారం లెక్కలు ఎలా ఉంటాయి?
ఈ ఆఫర్ కింద కంపెనీ నుంచి విడిపోయే ఉద్యోగులకు సర్వరెన్స్ పే కింద బలమైన ఆర్థిక భద్రత కల్పిస్తున్నారు. ప్రతి ఏడాది పూర్తి చేసిన సేవలకు గాను ఒక నెల బేసిక్ శాలరీని కంపెనీ చెల్లిస్తుంది. ఉదాహరణకు ఒక లక్ష రూపాయల బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగి ఐదేళ్లపాటు పనిచేసి ఉంటే, ఆయనకు ఐదు లక్షల రూపాయలు అందజేస్తారు. అంతర్గత నిబంధనల ప్రకారం కనీసం రెండు నెలల జీతం నుంచి గరిష్టంగా 39 వారాలు అంటే సుమారు తొమ్మిది నెలల బేసిక్ సాలరీ వరకు పొందే అవకాశం ఉంది.
నగదుతో పాటు లభించే ఇతర అదనపు ప్రయోజనాలు
కేవలం జీతం మాత్రమే కాకుండా ఉద్యోగం వదిలే వారికి కంపెనీ మరిన్ని పెద్ద లాభాలను ఇస్తోంది. ఉద్యోగం నుంచి తప్పుకున్న తర్వాత కూడా కుటుంబ సభ్యులతో కలిసి నిర్దిష్ట కాలం పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కొనసాగుతుంది. అలాగే ఉద్యోగుల వద్ద ఉన్న అన్‌వెస్టెడ్ షేర్లు తదుపరి ఆరు నెలల పాటు రెగ్యులర్‌గా వెస్ట్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి, కెరీర్ ప్లానింగ్ చేసుకోవడానికి అవసరమైన ప్రొఫెషనల్ సపోర్ట్ లేదా కెరీర్ ట్రాన్సిషన్ సర్వీసులను కూడా మైక్రోసాఫ్ట్ అందిస్తోంది.
ఆఫర్ తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి?
ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు. బిజినెస్ లీడర్లు తమ టీం అవసరాల ఆధారంగా దీనిని నిర్ణయించారు. సేల్స్, మార్కెటింగ్, సెక్యూరిటీ, కమర్షియల్ బిజినెస్, క్వాంటమ్ విభాగాలను ఈ ఆఫర్ నుంచి పూర్తిగా మినహాయించారు. మరోవైపు కోపైలట్, కోర్-ఏఐ, విండోస్, ఎక్స్‌బాక్స్, ఫైనాన్స్, హెచ్ఆర్ జట్లకు ఇందులో అవకాశం కల్పించారు. ఈ ఆఫర్ వద్దు అనుకునే ఉద్యోగులు యథావిధిగా తమ పనులను కొనసాగించవచ్చు. అయితే ఖర్చులు తగ్గకపోతే భవిష్యత్తులో బలవంతపు తొలగింపులు ఉండే రిస్క్ కూడా లేకపోలేదు.