Kerosene : వంట గ్యాస్ కష్టాలకు కేంద్రం చెక్.. మళ్ళీ వచ్చేస్తున్న కిరోసిన్.. 60 రోజుల ఎమర్జెన్సీ ప్లాన్ రెడీ
మళ్ళీ వచ్చేస్తున్న కిరోసిన్.. 60 రోజుల ఎమర్జెన్సీ ప్లాన్ రెడీ
Kerosene : మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పోరాటాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. మన దేశంలో కూడా వంట గ్యాస్ లభ్యత తగ్గకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక తాత్కాలిక మాస్టర్ ప్లాన్ వేసింది. సోమవారం ప్రకటించిన 60 రోజుల అత్యవసర ప్రణాళికలో భాగంగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనపు కిరోసిన్‌ను సరఫరా చేయాలని నిర్ణయించింది. గతంలో కిరోసిన్ రహితంగా ప్రకటించిన 21 ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ కిరోసిన్ పంపిణీని ప్రారంభించబోతున్నారు. వంట వండుకోవడానికి, వెలుతురు కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదనేదే ఈ నిర్ణయం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం.
పెట్రోల్ బంకుల్లోనూ కిరోసిన్ విక్రయాలు
ప్రజలకు కిరోసిన్ సులభంగా అందేలా చేసేందుకు పెట్రోలియం శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కిరోసిన్ లేని ప్రాంతాల్లోని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ అమ్మడానికి అనుమతి ఇచ్చింది. ప్రతి జిల్లాలో గరిష్టంగా రెండు బంకులకు (ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల అవుట్‌లెట్‌లకు) 5 వేల లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ ఉంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు లైసెన్స్ నిబంధనలను కూడా సడలించారు. అయితే భద్రతా నియమాలు మాత్రం కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
48,000 కిలోలీటర్ల అదనపు కోటా
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి దాదాపు 48,000 కిలోలీటర్ల అదనపు కిరోసిన్‌ను మంజూరు చేసింది. స్థానిక అధికారులు తమ పరిధిలో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి 17 రాష్ట్రాలు ఈ కోటాను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్, లడఖ్ మాత్రం తమకు ప్రస్తుతానికి అదనపు కోటా అవసరం లేదని తెలిపాయి. పారిశ్రామిక వినియోగం కంటే గృహ అవసరాలకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోంది.
నల్లబజారుపై ఉక్కుపాదం.. 2900 చోట్ల దాడులు
ఇంధన సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం నిఘాను తీవ్రం చేసింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా దాదాపు 2,900 ప్రాంతాల్లో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటూ 1,000కి పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని, ఇంధన సరఫరా సాఫీగా సాగేలా ప్రభుత్వం అదనపు ఎల్‌ఎన్‌జీ కార్గోలను కూడా ఏర్పాటు చేస్తోందని అధికారులు భరోసా ఇస్తున్నారు.
ఎల్పీజీ కనెక్షన్ల సరెండర్.. పీఎన్జీ వైపు మొగ్గు
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడుతున్న వారు ఎల్పీజీ కనెక్షన్లను వెనక్కి ఇస్తున్నారు. శనివారం నాటికి దాదాపు 6,000 మంది వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ X వేదికగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రియల్ వినియోగదారులకు 80 శాతం, ఎరువుల ఫ్యాక్టరీలకు 70-75 శాతం గ్యాస్ సరఫరా జరుగుతుండగా, సామాన్యుడి వంట గదికి మాత్రం పూర్తిస్థాయి కోటాను ప్రభుత్వం కేటాయిస్తోంది.