Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీని 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆర్‌బీఐ ఇటీవల రేపో రేటును తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులపై భారం తగ్గించడానికి ఈ మార్పును ప్రతిపాదిస్తోంది. అయితే ఈ నిర్ణయం వల్ల రైతులపై ఎలాంటి అదనపు భారం పడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫిబ్రవరి 2025 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేటును విడతల వారీగా 125 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ప్రస్తుతం అది 5.25 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఉండే స్వల్పకాలిక కేసీసీ రుణాలను 7 శాతం వడ్డీకే అందించేందుకు బ్యాంకులకు 1.5 శాతం వడ్డీ రాయితీని ఇస్తోంది. ఆర్‌బీఐ పాలసీ రేట్లు తగ్గడం వల్ల గ్రామీణ బ్యాంకుల్లో నిధుల వ్యయం (ఎంసీఎల్ఆర్) తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్న 1.5 శాతం వడ్డీ సబ్సిడీని 50 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ప్రతిపాదిస్తోంది.

2031-32 వరకు పథకం పొడిగింపునకు చర్యలు

బ్యాంకులతో జరుగుతున్న ఈ చర్చలు కేవలం సబ్సిడీ తగ్గింపునకు మాత్రమే పరిమితం కాలేదు. మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్‎ను 2031-32 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గత ఏడాది 1.5 శాతం వడ్డీ సబ్సిడీని కొనసాగిస్తూనే పథకాన్ని పొడిగించిన ప్రభుత్వం, ఇప్పుడు తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. బడ్జెట్‌లో కూడా ఈ పథకానికి రూ.22,600 కోట్లను కేటాయించడం విశేషం.

క్రమం తప్పకుండా రుణాలు తీర్చే రైతులకు పండగే

వడ్డీ రాయితీలో మార్పులు వచ్చినా సాధారణ రైతులు చెల్లించే వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదు. రైతులు యథావిధిగా 7 శాతం వడ్డీకే రుణాలు పొందుతారు. అంతేకాకుండా రుణాలను గడువులోగా చెల్లించే రైతులకు లభించే 3 శాతం అదనపు ప్రోత్సాహకం యథాతథంగా కొనసాగుతుంది. దీనివల్ల సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు కేవలం 4 శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం సబ్సిడీ భారాన్ని బ్యాంకులు సర్దుబాటు చేసుకుంటాయి తప్ప రైతులకు ఇచ్చే సదుపాయాల్లో ఎలాంటి కోత ఉండదు.

గ్రామీణ రుణ రంగానికి చేదోడుగా బ్యాంకులు

గ్రామీణ ప్రాంతాల్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాల నిర్వహణకు ఎక్కువ మంది సిబ్బంది అవసరమవుతారని, ప్రాసెస్ వ్యయం ఎక్కువగా ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మార్కెట్‌లో సర్‌ప్లస్ లిక్విడిటీ ఉన్నందున, తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని రైతులకు చేరవేయడం సులభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య బ్యాంకులలో రుణ వృద్ధి దాదాపు 14.5 శాతంగా నమోదవ్వడం ఈ దిశగా సానుకూల అంశం. కేసీసీ వడ్డీ రాయితీపై ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం బ్యాంకులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికే ఉపయోగపడుతుంది. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు లభించే 4 శాతం వడ్డీ ప్రయోజనం నిరంతరాయంగా అందుతూనే ఉంటుంది.

Tags: