LIC: ఎల్ఐసీ 70 ఏళ్ల పండగ వేళ రెండు ధమాకా ప్లాన్లు.. బీమా ప్లాటినం, జీవన్ రక్ష ప్లాన్లు లాంచ్
బీమా ప్లాటినం, జీవన్ రక్ష ప్లాన్లు లాంచ్
LIC: ఎల్ఐసీ తన 70వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం రెండు సరికొత్త పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఎల్ఐసీ బీమా ప్లాటినం, ఎల్ఐసీ జీవన్ రక్ష పేరుతో రూపుదిద్దుకున్న ఈ ప్లాన్లు పొదుపుతో పాటు ఆర్థిక రక్షణను అందిస్తాయి. ఈ పథకాలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
భద్రతతో పాటు గ్యారెంటీ రాబడినిచ్చే బీమా ప్లాటినం
ఎల్ఐసీ ప్రవేశపెట్టిన బీమా ప్లాటినం ప్లాన్ పొదుపు, ఆర్థిక భద్రతల కలయికగా రూపుదిద్దుకుంది. ఇదొక నాన్-లింక్డ్, నాన్-పార్ ఇండివిజువల్ లిమిటెడ్ ప్రీమియం ప్లాన్. ఇందులో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి వెయ్యి రూపాయల వార్షిక ప్రీమియంపై రూ. 70 చొప్పున గ్యారెంటీ అడిషన్ లభిస్తుంది. పొదుపు చేసుకుంటూనే కుటుంబ భవిష్యత్తుకు ధీటైన భరోసా వెతుక్కునే వారికి ఈ స్కీమ్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
బూస్టర్ ఇన్‌కమ్, రెగ్యులర్ ప్రయోజనాలు
బీమా ప్లాటినం ప్లాన్ లో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత బూస్టర్ ఇన్‌కమ్ బెనిఫిట్. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన తర్వాత ఐదో సంవత్సరం ముగిసే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే ప్రాథమిక హామీ మొత్తంలో 70 శాతాన్ని బూస్టర్ ఇన్‌కమ్‌గా అందిస్తారు. పాలసీ వ్యవధిలో ప్రీమియం చెల్లింపు కాలాన్ని మినహాయించి మిగిలిన వ్యవధికి ప్రతి సంవత్సరం ప్రాథమిక హామీ మొత్తంలో 10 శాతం రెగ్యులర్ ఇన్‌కమ్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. ఇందులో కనీస హామీ మొత్తం రూ.3,00,000 కాగా, గరిష్ట పరిమితి లేదు. 7, 10, 12, 15, 18 ఏళ్ల వ్యవధుల్లో ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. 30 రోజుల పసిపాపల నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ ప్లాన్‌లో చేరవచ్చు.
స్వల్ప ఖర్చుతో పూర్తి రక్షణనిచ్చే జీవన్ రక్ష
తక్కువ వ్యయంతో కుటుంబానికి పూర్తి లైఫ్ రిస్క్ కవరేజ్ అందించడానికి ఎల్ఐసీ జీవన్ రక్ష(ప్లాన్ 894)ను డిజైన్ చేసింది. ఇది ఒక నాన్-పార్, నాన్-లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్. పాలసీ వ్యవధిలో బీమా పొందిన వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబానికి గ్యారెంటీగా ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకంలో బోనస్ లేదా అదనపు లాభాలు ఉండవు కానీ నిశ్చితమైన డెత్ బెనిఫిట్ లభిస్తుంది. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు.
మహిళలకు ప్రత్యేక రాయితీలు, రైడర్ సౌకర్యం
జీవన్ రక్ష ప్లాన్‌లో కనీస హామీ మొత్తం రూ.5 లక్షలు కాగా గరిష్ట పరిమితి రూ.24 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లింపు కోసం సింగిల్, రెగ్యులర్, లిమిటెడ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మహిళా పాలసీదారులకు ప్రీమియం దరాల్లో ప్రత్యేక మినహాయింపులు లభిస్తాయి. ఎక్కువ మొత్తంలో హామీ ఎంచుకునే వారికి ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. అదనపు కవరేజ్ కోసం రైడర్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. పాత ఎల్ఐసీ ఖాతాదారులు, క్లెయిమ్ పొందిన వారి నామినీలకు బీమా ప్లాటినం ప్లాన్ కొనుగోలుపై ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు.