LIC : ఎల్‌ఐసీ రికార్డు స్థాయి లాభాలు.. క్యూ1లో ఏకంగా రూ.13,492 కోట్ల నెట్ ప్రాఫిట్
రూ.13,492 కోట్ల నెట్ ప్రాఫిట్
LIC : దేశంలోనే అతిపెద్ద జీవిత భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆర్థిక సంవత్సరం 2027 తొలి త్రైమాసికం (Q1) లో అద్భుతమైన పనితీరును కనబరిచింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ స్టాండలోన్ నికర లాభం గతేడాదితో పోలిస్తే 23 శాతం పెరిగి రూ.13,492 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.10,986 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో ఎల్‌ఐసీ నెట్ ప్రీమియం ఆదాయం కూడా 7 శాతం వృద్ధితో రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. ఐఆర్‌డీఏఐ గణాంకాల ప్రకారం భారత జీవిత భీమా రంగంలో మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయం ఆధారంగా ఎల్‌ఐసీ 60.1 శాతం ఆధిపత్య మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.
పెరిగిన ఇండివిడ్యువల్, గ్రూప్ ప్రీమియం బిజినెస్
ఎల్‌ఐసీ వ్యక్తిగత వ్యాపార ప్రీమియం 6 శాతం పెరిగి రూ.75,416 కోట్లకు చేరింది. గ్రూప్ బిజినెస్ ప్రీమియం ఏకంగా 9 శాతం వృద్ధితో రూ.51,834 కోట్లను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఎల్‌ఐసీ వ్యక్తిగత విభాగంలో దాదాపు 31.02 లక్షల కొత్త పాలసీలను విక్రయించింది. యాన్యువలైజ్డ్ ప్రీమియం ఈక్వివలెంట్ ప్రాతిపదికన మొత్తం ప్రీమియం రూ.13,692 కోట్లుగా ఉండగా, అందులో ఇండివిడ్యువల్ బిజినెస్ వాటా 55 శాతం (రూ.7,532 కోట్లు), గ్రూప్ బిజినెస్ వాటా 45 శాతం (రూ.6,160 కోట్లు) గా నమోదు కావటం విశేషం.
విఎన్‌బి, మార్జిన్లలో భారీ దూకుడు
ఎల్‌ఐసీ కొత్త వ్యాపార విలువ ఏకంగా 61 శాతం పెరిగి రూ.3,136 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.1,944 కోట్లుగా ఉంది. నెట్ VNB మార్జిన్ కూడా 750 బేసిస్ పాయింట్లు పెరిగి 15.4% నుంచి 22.9 శాతానికి చేరుకుంది. ప్రొడక్ట్ మిక్స్ పరంగా వ్యక్తిగత విభాగంలో పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్స్ వాటా 67.51% ఉండగా, నాన్-పార్టిసిపేటింగ్ ఉత్పత్తుల వాటా 32.49 శాతానికి పెరిగింది. ఇది ఎల్‌ఐసీ సరైన వ్యూహంతో అధిక లాభాలనిచ్చే ప్రొడక్ట్ వైపు అడుగులు వేస్తోందని స్పష్టం చేస్తోంది.
రూ.59.39 లక్షల కోట్లకు చేరిన ఆస్తులు
30 జూన్ 2026 నాటికి ఎల్‌ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ ఏటా 4 శాతం పెరిగి రూ.59.39 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది ఇది రూ.57.05 లక్షల కోట్లుగా ఉండేది. కంపెనీ సాల్వెన్సీ నిష్పత్తి 2.17 నుంచి 2.42 కి మెరుగుపడింది. ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆర్. దొరైస్వామి మాట్లాడుతూ.. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ ఎల్‌ఐసీ ఇండివిడ్యువల్, గ్రూప్ విభాగాల్లో తన లీడర్‌షిప్‌ను కాపాడుకుందని, ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ వల్లనే విఎన్‌బి 61 శాతానికి పైగా పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు