Gas Cylinder eKYC: గ్యాస్ వినియోగదారులు అలర్ట్.. మారిన ఇ-కేవైసీ రూల్స్.. ఆన్లైన్లో ఎలా చేయాలంటే?
ఆన్లైన్లో ఎలా చేయాలంటే?
Gas Cylinder eKYC: వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు ఇ-కేవైసీ ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో ఆగస్టు 15 వరకు మాత్రమే అవకాశం ఇవ్వగా, చాలామంది వినియోగదారులు ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. దీంతో సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్రం ఆగస్టు 23 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేసుకుంటేనే ఎలాంటి అవాంతరాలు లేకుండా గ్యాస్ సిలిండర్లు ఇంటికి చేరుతాయి.
కేవైసీ ఎందుకు తప్పనిసరి చేశారు?
గతంలో అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభాలు, గ్యాస్ కొరత సమయాల్లో అక్రమ సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రాయితీలు, సిలిండర్లు అందేలా చూడటానికి ఇ-కేవైసీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. నకిలీ కనెక్షన్లను ఏరివేసి, అసలైన వినియోగదారులకు నిరంతర సరఫరా అందించడమే ఈ నిబంధన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
ఇంటి నుంచే ఫోన్ ద్వారా కేవైసీ పూర్తి చేసే విధానం
ఏజెన్సీల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ నుంచే కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన అధికారిక యాప్‌తో పాటు, ఆథార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యాక, స్క్రీన్‌పై కనిపించే ఎల్పీజీ ఇ-కేవైసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఉన్న నిబంధనలను అంగీకరించి ముఖాన్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. స్కాన్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే మీ కేవైసీ దరఖాస్తు ఆమోదం పొందుతుంది.
ఆలస్యం చేస్తే సిలిండర్ సరఫరా బంద్
పొడిగించిన గడువు చాలా తక్కువగా ఉన్నందున వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయడం శ్రేయస్కరం. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 23 లోపు కేవైసీ పూర్తి చేయని పక్షంలో సిలిండర్ బుకింగ్ ఆగిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని గ్రహించాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి నెలా గ్యాస్ పొందడానికి వెంటనే ఈ చిన్న పని పూర్తి చేయడం మంచిది.