December Changes : ఎల్పీజీ, లోన్ ఈఎంఐల నుంచి వీసా వరకు..డిసెంబర్లో జరిగే కీలక మార్పులు ఇవే

డిసెంబర్లో జరిగే కీలక మార్పులు ఇవే

Update: 2025-12-01 06:26 GMT

December Changes : మరి కొద్ది గంటల్లో ప్రస్తుత సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ 2025 ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా వచ్చే మార్పుల మాదిరిగానే, ఈ నెలలో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు నేరుగా మన జేబుపై, ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటిలో ఎల్‌పీజీ, ఏటీఎఫ్ ధరల సవరణ, బ్యాంక్ సెలవులు, వడ్డీ రేట్లలో మార్పు (ఈఎంఐ), అలాగే హెచ్1బీ వీసా, పెన్షనర్లకు సంబంధించిన చివరి తేదీలు వంటి అంశాలు ఉన్నాయి. డిసెంబర్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి.

ఎల్‌పీజీ, ఏటీఎఫ్ ధరల్లో మార్పు

ప్రతి నెల మొదటి తేదీన, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరల సగటు, విదేశీ మారకపు రేటు ఆధారంగా ఈ ధరలు మారుతాయి. డిసెంబర్ 1న ఎల్‌పీజీ ధరలు పెరిగినా, తగ్గినా, అది 14.2 కిలోల (డొమెస్టిక్), 19 కిలోల (కమర్షియల్) గ్యాస్ సిలిండర్ ధరలపై ప్రభావం చూపుతుంది. అలాగే ఏటీఎఫ్ ధరల్లో మార్పు మీ విమాన టికెట్ ధరల్లో హెచ్చుతగ్గులకు దారి తీస్తుంది.

బ్యాంక్ సెలవుల జాబితా

డిసెంబర్ 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 18 రోజుల పాటు బ్యాంక్ సెలవులను ప్రకటించింది. ఇందులో ఆదివారాలు, రెండో శనివారం, నాల్గవ శనివారం సహా పండుగల సెలవులు ఉన్నాయి. డిసెంబర్ 1, 3, 7, 12, 13, 14, 18, 19, 20, 21, 24, 25, 26, 27, 28, 30, 31 తేదీల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. బ్యాంక్ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. కాబట్టి ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలను ప్లాన్ చేసుకునే ముందు మీ ప్రాంతంలోని స్థానిక బ్యాంక్ శాఖను సంప్రదించడం మంచిది.

లోన్ ఈఎంఐలో మార్పు ఉంటుందా?

డిసెంబర్ 3 నుంచి 5 వరకు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటును తగ్గించే అవకాశంపై కేంద్ర బ్యాంక్ చర్చించనుంది. రెపో రేటు అనేది కమర్షియల్ బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేటు. చాలా మంది విశ్లేషకులు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించి 5.25 శాతానికి తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ రెపో రేటు తగ్గితే, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది, దీనివల్ల మీ లోన్ ఈఎంఐ భారం తగ్గుతుంది.

హెచ్1బీ వీసా, టారిఫ్‌ల అప్‌డేట్స్

అమెరికన్ వీసా బులిటెన్‌లో ఇటీవల హెచ్1బీ వీసాలు (ఉద్యోగాధారిత వీసాలు) గురించి కొత్త అప్‌డేట్స్ వచ్చాయి. డిసెంబర్ 2025కు సంబంధించిన యూఎస్ వీసా బులిటెన్‌ను అమెరికా విదేశాంగ శాఖ ప్రచురించింది. ఇది భారతదేశం వలస వీసా కేటగిరీలలో పురోగతిని, ఫైనల్ యాక్షన్ డేట్స్, అప్లికేషన్ ఫైలింగ్ డేట్స్ వివరాలను వెల్లడించింది.

వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకారం.. భారతదేశం, అమెరికా మధ్య పరస్పర సుంకాలపై ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని డిసెంబర్ చివరి నాటికి ఖరారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన ముందడుగు.

ముఖ్యమైన గడువులు (పెన్షన్, టీడీఎస్)

నవంబర్ 30తో ముగిసిన కొన్ని ముఖ్యమైన గడువుల గురించి పౌరులు తెలుసుకోవాలి. ఎన్‌పీఎస్ నుంచి యూపీఎస్‎కు బదిలీ చేయడానికి చివరి తేదీ నవంబర్ 30. అలాగే, పెన్షనర్లు తమ వార్షిక లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్‌గా లేదా భౌతికంగా తమ బ్యాంక్/పోస్టాఫీసులో సమర్పించడానికి చివరి తేదీ కూడా అదే.

పన్ను చెల్లింపుదారులు, అక్టోబర్ నెలలో సెక్షన్ 194-IA, 194-IB, 194M, 194S కింద చేసిన అధిక విలువ కలిగిన లావాదేవీల కోసం టీడీఎస్ వివరాలను ఫైల్ చేయడానికి చివరి తేదీ కూడా నవంబర్ 30. ఈ గడువును దాటితే జరిమానా లేదా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావొచ్చు.

Tags:    

Similar News