Aadhaar Card: త్వరలో ఆధార్ కొత్త కార్డ్.. ఇకపై దాని మీద మీ వివరాలుండవ్
ఇకపై దాని మీద మీ వివరాలుండవ్
Aadhaar Card: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటోంది. కార్డుదారుల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం కాకుండా చూడటం, పాత పద్ధతిలో జరిగే ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ను పూర్తిగా ఆపేయడం దీని ముఖ్య ఉద్దేశం. అందుకే త్వరలో జారీ చేయబోయే కొత్త ఆధార్ కార్డులపై కేవలం మీ ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా UIDAI ప్లాన్ చేస్తోంది. ఈ విషయంపై డిసెంబర్ నెలలో కొత్త నిబంధన తీసుకురావాలని UIDAI సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు.
ఆధార్ కార్డుపై డీటెయిల్స్ ఎక్కువ ఉంటే, వాటిని ఉపయోగించి అక్రమాలు చేయాలనుకునే వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే కార్డుపై పేరు, అడ్రస్ వంటి వివరాలు లేకుండా కేవలం మీ ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంచాలని UIDAI ఆలోచిస్తోంది. ముఖ్యంగా వయస్సును నిర్ధారించే ప్రక్రియను పెంచేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయి. వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలనేది దీని వెనుక ఉన్న ప్రధాన కారణం.
ప్రస్తుతం హోటళ్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు వంటి సంస్థలు ఆధార్ కార్డు ఫోటోకాపీలను అడుగుతున్నారు. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం ఆధార్ నంబర్ లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించడం, నిల్వ చేయడం ఆధార్ చట్టం ప్రకారం సరైంది కాదు. అయినప్పటికీ చాలా సంస్థలు ఆధార్ కాపీలను తీసుకుని స్టోర్ చేస్తున్నాయి. ఈ పద్ధతిని పూర్తిగా ఆపేయడానికి UIDAI డిసెంబర్ 1న ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఆధార్ అనేది ఒక డాక్యుమెంట్ లా కాకుండా, కేవలం అథెంటికేషన్ లేదా వెరిఫికేషన్ కోసం మాత్రమే ఉపయోగపడాలి. లేకపోతే నకిలీ ఆధార్ కార్డుల వాడకం పెరిగిపోయే ప్రమాదం ఉంది.
UIDAI త్వరలో ఒక కొత్త మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనుంది. ఇది ఇప్పుడు వాడుకలో ఉన్న mAadhaar యాప్ స్థానంలోకి వస్తుంది. బ్యాంకులు, హోటళ్లు, ఇతర కంపెనీల ప్రతినిధులతో UIDAI ఇప్పటికే సమావేశమైంది. ఈ కొత్త యాప్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్కు అనుగుణంగా ఆధార్ అథెంటికేషన్ సేవలను మరింత మెరుగుపరుస్తుంది.
కొత్త యాప్ ద్వారా లాభాలు
ఈ కొత్త యాప్ ద్వారా కార్డుదారులు తమ చిరునామా సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ లేని కుటుంబ సభ్యులకు కూడా ఈ యాప్ ద్వారా వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.ఫేస్ రికగ్నిషన్ ద్వారా కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసే అవకాశం కూడా ఉంది.
వెరిఫికేషన్ పద్ధతి ఎలా మారుతుంది?
కొత్త యాప్ రాకతో హోటల్ చెక్-ఇన్‌లు, ఈవెంట్‌లలో ప్రవేశం, సినిమా హాళ్లు, 18 ఏళ్లు నిండినవారికి వస్తువుల కొనుగోలు వంటి అనేక చోట్ల వెరిఫికేషన్ సులభతరం అవుతుంది. ఆధార్ కార్డు హోల్డర్ ఆ సంస్థ స్కానర్‌లో క్యూఆర్ కోడ్‌ను చూపిస్తారు. ఆ తర్వాత, సిస్టమ్ ఫేస్ రికగ్నిషన్ కోసం అడుగుతుంది. ఇది ఆధార్ కార్డు హోల్డర్ అక్కడే ఉన్నారని నిర్ధారిస్తుంది. త్వరలో ఈ కొత్త వ్యవస్థను అమలు చేయాలనుకునే సంస్థల కోసం దరఖాస్తులు స్వీకరించడం మొదలవుతుంది. ఈ మార్పులన్నీ ఆధార్ వినియోగాన్ని సురక్షితంగా, మరింత గోప్యంగా ఉంచడంలో సహాయపడతాయి.