Microsoft : మరోసారి భారీ తొలగింపులకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్.. ఈ సారి 9100మంది పై వేటు
ఈ సారి 9100మంది పై వేటు;
Microsoft : సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ తగిలింది! కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4 శాతం మందిని, అంటే సుమారు 9,100 మందిని తొలగించబోతోంది. ఇది 2023 తర్వాత మైక్రోసాఫ్ట్ చేపట్టిన అతి పెద్ద తొలగింపు ప్రక్రియ అని సియాటెల్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కూడా టెక్ రంగంలో ఇలాంటి తొలగింపులు చాలానే జరిగాయి.
ఏ విభాగాలపై ఎక్కువ ప్రభావం?
గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ డెవలపర్‌లకే పరిమితమైన తొలగింపులు, ఈసారి సేల్స్, మార్కెటింగ్ విభాగాలపై ఎక్కువగా ప్రభావం చూపనున్నాయి. జూన్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్‌లో 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, కేవలం సేల్స్, మార్కెటింగ్ టీమ్‌లోనే 45,000 మంది పనిచేస్తున్నారు. ఈ విభాగాల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అమ్మకాలను థర్డ్-పార్టీ ఏజెన్సీలకు అప్పగిస్తామని మైక్రోసాఫ్ట్ ఏప్రిల్ 2025లోనే ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రస్తుత తొలగింపులకు ఒక కారణంగా నిలుస్తోంది.
మైక్రోసాఫ్ట్ గతంలో కూడా ఉద్యోగులను తొలగించింది. మే 2025లో సుమారు 6,000 మందిని, ఆ తర్వాత జూన్ మొదట్లో 300 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు ఈ భారీ తొలగింపు ప్రకటన ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.