SBI Data Leak: డేటా లీక్ భయం.. రూ.1,425 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కు సిద్ధమవుతున్న స్టేట్ బ్యాంక్
స్టేట్ బ్యాంక్
SBI Data Leak: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ కస్టమర్ల డేటా రక్షణకు సంబంధించి ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. హ్యాకర్ల సమూహం ఎస్బీఐకి చెందిన సున్నితమైన డేటాను సైబర్ నేరగాళ్ల అడ్డా అయిన డార్క్ వెబ్‌లో ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన బయటపడటంతో బ్యాంక్ యాజమాన్యం తక్షణమే స్పందించింది. ఎంతమేర నష్టం వాటిల్లిందనే అంశంపై సమగ్ర అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే సంభవించిన నష్ట పరిహారం కోసం భీమా సంస్థకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
డార్క్ వెబ్‌లో లీక్ అయిన డేటా
వెలువడుతున్న కథనాల ప్రకారం, హ్యాకర్లు సుమారు 2,722 పీడీఎఫ్ ఫైళ్లను డార్క్ వెబ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు. వీటిలో లక్షలాది డేటా వరుసలతో పాటు 3,897 మంది కస్టమర్ల వ్యక్తిగత వివరాలు స్పష్టంగా ఉన్నట్లు బ్యాంక్ ప్రాథమికంగా గుర్తించింది. లీక్ అయిన సమాచారంలో ఖాతాదారుల పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈమెయిల్ ఐడీలు, నివాస చిరునామాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కస్టమర్లు రుణాలు తీసుకోవడానికి సమర్పించిన లోన్ అప్లికేషన్ వివరాలు కూడా అందులో ఉన్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
రూ.1,425 కోట్ల సైబర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్
ఈ సంచలన ఘటన నేపథ్యంలో ఎస్బీఐ తమ వద్ద ఉన్న భారీ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా నష్ట పరిహారం కోరే ఆలోచనలో ఉంది. ప్రముఖ ప్రభుత్వ భీమా సంస్థ ఓరియంటల్ ఇన్సూరెన్స్ నుంచి ఎస్బీఐ రూ.1,425 కోట్ల పరిమితి కలిగిన సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది. జరిగిన నష్టం అలాగే డేటా రక్షణ చట్టాల ఉల్లంఘన వల్ల తలెత్తే ఖర్చులను ఈ ఇన్సూరెన్స్ కవర్ చేసే అవకాశం ఉంది. అయితే ఎంత మొత్తం క్లెయిమ్ లభిస్తుందనేది పాలసీ నియమావళి, అలాగే భవిష్యత్తులో జరిగే తుది విచారణ నివేదికలపై ఆధారపడి ఉంటుంది.
విచారణ వేగవంతం చేసిన సైబర్ ఏజెన్సీలు
డేటా చోరీ ఘటనపై స్పందించిన ఎస్బీఐ తక్షణమే సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రోటోకాల్‌ను అమల్లోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా విభాగమైన సెర్ట్-ఇన్ (CERT-In) ప్యానెల్లో ఉన్న స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని ఈ వ్యవహారంలో నియమించారు. డేటా లీక్ కావడానికి అసలు కారణాలు ఏమిటి, వ్యవస్థలో ఎక్కడ లోపం ఏర్పడింది అనే విషయాలపై ఈ ఏజెన్సీ లోతుగా శోధిస్తోంది. కస్టమర్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగిన రక్షణ చర్యలను మరింత కఠినతరం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.