Swiggy Share: భారత స్టాక్ మార్కెట్లో ఫుడ్ డెలివరీ అలాగే క్విక్-కామర్స్ దిగ్గజం స్విగ్గీ ఇన్వెస్టర్లకు అక్టోబర్ 23వ తేదీ భారీ నిరాశను మిగిల్చింది. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే కంపెనీ షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో ఒక్కసారిగా 14 శాతానికి పైగా లోయర్ సర్క్యూట్ తాకిన షేర్లు రూ.179.65 స్థాయికి పడిపోయాయి. ఈ ఒక్క రోజు పరిణామం కారణంగా కంపెనీ మార్కెట్ విలువలో దాదాపు రూ.9,000 కోట్లు ఆవిరైపోయాయి. రెండో తైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇన్‌స్టామార్ట్ నష్టాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

కంపెనీ వెలువరించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. నికర నష్టాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఆశించిన స్థాయిలో లేవు. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.1,092 కోట్ల నుంచి రూ.922 కోట్లకు చేరింది. అయితే ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన రూ.7,571 కోట్లకు పెరిగింది. ఫుడ్ డెలివరీ బిజినెస్ వృద్ధి 17.2 శాతంగా నమోదు కాగా, మార్కెట్ అంచనాలు దీనికంటే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టామార్ట్ క్విక్-కామర్స్ వ్యాపారంలో పెరుగుతున్న నష్టాలు, ఈబీఐడీఏ నష్టం సుమారు రూ.770 కోట్లకు చేరుకోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది.

బ్రోకరేజ్ సంస్థల ఆందోళన

స్విగ్గీ బలహీనమైన పనితీరును గమనించిన ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు కంపెనీ టార్గెట్ ధరలను భారీగా తగ్గించాయి. హెచ్‌ఎస్‌బీసీ సంస్థ హోల్డ్ రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.315 నుంచి రూ.240కి తగ్గించింది. అలాగే జెఫరీస్ సంస్థ బై రేటింగ్ ఇచ్చినప్పటికీ టార్గెట్ ధరను రూ.330కి కుదించింది. సిటీ అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) వంటి దిగ్గజ సంస్థలు కూడా క్విక్-కామర్స్ విభాగంలో పెరుగుతున్న ఖర్చులు అలాగే పోటీ తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తమ టార్గెట్ ధరలను సవరించాయి.

భవిష్యత్ వృద్ధి ప్రణాళికలు

వ్యాపారంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు స్విగ్గీ మేనేజ్‌మెంట్ భవిష్యత్ వ్యూహాలను ప్రకటించింది. వచ్చే ఏడాది కాలంలో ఫుడ్ డెలివరీ విభాగంలో 18 నుంచి 20 శాతం వృద్ధిని సాధించగలమని ధీమా వ్యక్తం చేసింది. క్విక్-కామర్స్ విభాగంలో కంట్రిబ్యూషన్ మార్జిన్‌ను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. త్వరలో ప్రారంభం కానున్న ఐఓసీసీ పరివర్తన ద్వారా మార్జిన్లను మరింత బలపరుచుకోవాలని కంపెనీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.

Tags: