Food Prices : నిత్యావసరాల విషయంలో కేంద్రం కీలక ప్రకటన.. సామాన్యులకు భారీ ఊరట
సామాన్యులకు భారీ ఊరట
Food Prices : పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నా.. భారతీయ వంటగదిపై దాని ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగానే ఉన్నాయని, ఎక్కడా అసాధారణమైన హెచ్చుతగ్గులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్యుడికి ధరల భారం కలగకుండా ఉండేందుకు హోల్ సేల్, రిటైల్ మార్కెట్లపై కేంద్రం నిరంతరం డేగ కన్ను వేసి ఉంచింది.
ప్రతిరోజూ నిఘా.. 528 కేంద్రాల్లో తనిఖీలు
వినియోగదారుల వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం... దేశవ్యాప్తంగా 528 ప్రధాన కేంద్రాల్లో దాదాపు 40 రకాల నిత్యావసర వస్తువుల ధరలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను కూడా వాడుతున్నారు. మార్కెట్‌లో ఎక్కడైనా ధరలు అకస్మాత్తుగా పెరిగితే వెంటనే జోక్యం చేసుకునేలా అధికారులు సిద్ధంగా ఉన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై, నల్లబజారుకు తరలించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పప్పులు, కూరగాయల నిల్వలు పుష్కలం
ఈ ఏడాది పప్పుధాన్యాల దిగుబడి ఆశాజనకంగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం సుమారు 28 లక్షల టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉంది. సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు కందిపప్పు, మినప్పప్పు దిగుమతులను మార్చి 2027 వరకు 'ఫ్రీ కేటగిరీ'లోనే ఉంచారు. ఇక ఉల్లి, ఆలుగడ్డ, టమోటా వంటి కూరగాయల దిగుబడి కూడా గత ఏడాదితో సమానంగా ఉంది. ఉల్లి ధరలు పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తుగానే భారీ స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించి నిల్వలను పెంచుతోంది.
గిడ్డంగుల్లో ధాన్యపు రాశులు.. కొరత అన్నదే లేదు
ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ లెక్కల ప్రకారం, దేశంలో గోధుమలు, బియ్యం నిల్వలు అవసరానికి మించే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ గిడ్డంగుల్లో 222 లక్షల టన్నుల గోధుమలు, 380 లక్షల టన్నుల బియ్యం నిల్వ ఉన్నాయి. ఇవి రేషన్ సరఫరాకు మాత్రమే కాకుండా ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి సరిపోతాయి. గత ఒక ఏడాది కాలంగా బియ్యం, గోధుమల ధరల్లో పెద్దగా మార్పులు లేకపోవడం విశేషం.
వంట నూనెలు, చక్కెర ధరలపైనా నియంత్రణ
విదేశాల నుండి వచ్చే వంట నూనెల సరఫరా కూడా నిరాటంకంగా సాగుతోంది. ఇండోనేషియా, మలేషియా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల నుండి దిగుమతులు క్రమం తప్పకుండా అందుతున్నాయి. దీనికి తోడు మన దేశంలో ఆవాల దిగుబడి ఈసారి చాలా బాగుండటంతో వంట నూనెల ధరలు అదుపులోనే ఉన్నాయి. చక్కెర సరఫరా విషయంలో కూడా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైతే మార్కెట్లోకి అదనపు నిల్వలను విడుదల చేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఉంచింది.