ITR Filing: అసెస్మెంట్ ఇయర్ 2026-27 ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31న డెడ్‌లైన్ ముగిసింది. సాంకేతిక సమస్యలు లేదా ఇతర కారణాలతో ఐటీఆర్ ఫైల్ చేయలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. డిసెంబర్ 31 వరకు లేట్ ఫీజు చెల్లించి బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేసే వెసులుబాటును ఐటీ శాఖ కల్పించింది. ఆగస్టు 31 నాటికి ఐటీఆర్ దాఖలు చేయలేకపోయిన పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్ సమర్పించవచ్చు. అయితే దీని కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బాకీ ఉన్న పన్ను మొత్తానికి వడ్డీ కూడా తోడవుతుంది. ఐటీ శాఖ మీ అసెస్మెంట్‌ను డిసెంబర్ 31 లోపే పూర్తి చేస్తే, ఆ తర్వాత రిటర్న్ ఫైల్ చేసే అవకాశం ఉండదని పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే బిలేటెడ్ రిటర్న్ ప్రక్రియను పూర్తి చేయడం శ్రేయస్కరం.

జరిమానాతో పాటు ఎదురయ్యే నష్టాలు

మీ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాలి. ఒకవేళ రూ.5 లక్షల కంటే ఎక్కువ సంపాదన ఉంటే గరిష్టంగా రూ.5,000 వరకు జరిమానా పడుతుంది. ఇవే కాక బాకీ ఉన్న పన్నుపై నెలకు 1 శాతం చొప్పున వడ్డీ భారం పడుతుంది. డెడ్‌లైన్ దాటడం వల్ల బిజినెస్ లేదా క్యాపిటల్ నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వెసులుబాటును పన్ను చెల్లింపుదారులు కోల్పోతారు. పాత ట్యాక్స్ విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉండదు. కొత్త పన్ను విధానంలోనే ఐటీఆర్ ఫైల్ చేయాల్సి రావడంతో రాయితీలు లభించవు. బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేసినా కూడా మీ ట్యాక్స్ రిఫండ్ పొందవచ్చు, కాకపోతే కాస్త సమయం పడుతుంది.

సవరించిన రిటర్న్ ద్వారా తప్పులు సరిదిద్దుకోండి

త్వరపడి ఫైల్ చేసిన ఐటీఆర్‌లో ఏదైనా సమాచారం తప్పుగా నమోదు చేసినా లేదా ఏదైనా వివరాలు విస్మరించినా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఐటీ శాఖ రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసే సదుపాయాన్ని అందిస్తోంది. మార్చి 31, 2027 వరకు మీ తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ఫైల్ చేయవచ్చు. డిసెంబర్ 31 లోపే రివైజ్ చేస్తే ఎలాంటి అదనపు రుసుము ఉండదు. ఆ తర్వాత చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఫైన్ పడుతుంది.

కొండంత ఊరటనిచ్చే కాండోనేషన్ ప్రక్రియ

డిసెంబర్ 31 నాటికి కూడా రిటర్న్ దాఖలు చేయలేకపోయిన వారికి చివరి మార్గంగా కాండోనేషన్ అభ్యర్థన తోడ్పడుతుంది. సరైన సమయానికి రిటర్న్ ఫైల్ చేయలేకపోవడానికి బలమైన కారణాలను ఆదాయపు పన్ను అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. చెల్లుబాటు అయ్యే రిఫండ్ క్లెయిమ్‌లు లేదా నష్టాల నమోదు వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. ఆధారాలతో సహా సమర్పించిన దరఖాస్తును పరిశీలించిన తర్వాత అధికారులు సంతృప్తి చెందితేనే లేట్ ఫైలింగ్‌కు అనుమతిస్తారు.

Tags: