Mukesh Ambani : రూ. 31 వేల కోట్ల మార్కెట్‌పై ముకేశ్ అంబానీ కన్ను.. దిగ్గజ కంపెనీలకు గుండె దడ
దిగ్గజ కంపెనీలకు గుండె దడ
Mukesh Ambani : భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్ అనిమల్ ఫుడ్ మార్కెట్ ఒకటి. ఈ రంగంలో దాదాపు రూ. 31,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. ఇప్పుడు ఈ భారీ మార్కెట్‌పై భారతదేశపు దిగ్గజ కంపెనీ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కన్నేసింది. నెస్లే, మార్స్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి పెద్ద కంపెనీలకు పోటీగా, రిలయన్స్ తన ఉత్పత్తులను సగం ధరకే అందించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కూల్ డ్రింక్స్ రంగంలో క్యాంపా కోలా లాగా, పెట్ ఫుడ్ మార్కెట్‌లో కూడా సంచలనం సృష్టించడానికి రిలయన్స్ వస్తోంది.
రిలయన్స్ రిటైల్ కన్స్యూమర్ ప్రొడక్ట్ విభాగం, తమ సొంత బ్రాండ్‌తో పెట్ ఫుడ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది.రిలయన్స్ తీసుకొస్తున్న పెట్ ఫుడ్ బ్రాండ్ పేరు వాగీస్. ఈ వాగీస్ ధరను ఇప్పటికే ఉన్న దిగ్గజ కంపెనీల ఉత్పత్తుల కంటే 20 నుంచి 50 శాతం వరకు తక్కువగా ఉంచాలని రిలయన్స్ పంపిణీదారులు, ట్రేడ్ ఛానెల్స్‌కు చెప్పినట్లు సమాచారం. ఇది గతంలో క్యాంపా కోలా విషయంలో అనుసరించిన వ్యూహాన్ని పోలి ఉంది. పెట్స్ ఉన్న కుటుంబాలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా టైర్-2 నగరాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని చిన్న దుకాణాలలో కూడా ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం రిలయన్స్ లక్ష్యం.
భారతదేశంలో పెట్ ఫుడ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో పెట్ కేర్ మార్కెట్ ప్రస్తుతం 3.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,000 కోట్లు) ఉండగా, ఇది 2028 నాటికి రెట్టింపు అయి 7 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.భారతీయ ఇళ్లలో పెంపుడు జంతువుల సంఖ్య 2019లో 2.6 కోట్లు ఉండగా, 2024 నాటికి అది 3.2 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం పెడిగ్రీ, పురీనా, రాయల్ కానైన్ వంటి బ్రాండ్లు ఈ మార్కెట్‌లో ప్రధానంగా ఉన్నాయి.
2027 నాటికి దేశమంతా విస్తరణ
రిలయన్స్ ప్రస్తుతం కూల్‌డ్రింక్స్, జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్, ఇతర ఉత్పత్తులను మార్కెట్‌లో ఉన్న వాటి కంటే 20-40 శాతం తక్కువ ధరకే విక్రయిస్తోంది. అయితే, రిలయన్స్ ఉత్పత్తులు ఇంకా దేశవ్యాప్తంగా అందుబాటులో లేవు. రిలయన్స్ వినియోగదారుల ఉత్పత్తుల విభాగం డైరెక్టర్ టి. కృష్ణకుమార్ (గతంలో కోకా-కోలా మాజీ అధిపతి) మాట్లాడుతూ.. 2027 మార్చి నాటికి తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు. రిలయన్స్ ముఖ్యంగా 60 కోట్ల సాధారణ వినియోగదారులపై దృష్టి పెట్టడంతో పాటు, చిన్న చిన్న పక్క దుకాణాల యజమానులకు మంచి లాభాలు ఇచ్చి, వారితో కలిసి పనిచేసే వ్యూహాన్ని అనుసరిస్తోంది. రిలయన్స్ ఎంట్రీతో, మార్కెట్‌లో ఉన్న దిగ్గజ కంపెనీలు తమ అమ్మకాలు తగ్గకుండా ఉండేందుకు తక్కువ ధర ప్యాక్‌లను, లేదా ఎక్కువ లాభాలను ఆఫర్ చేయవలసి రావచ్చు.