Mukesh Ambani : ఎలాన్ మస్క్ శత్రువుతో చేతులు కలపబోతున్న ముకేశ్ అంబానీ.. రూ.3.4లక్షల కోట్ల డీల్

రూ.3.4లక్షల కోట్ల డీల్;

Update: 2025-06-12 09:18 GMT

Mukesh Ambani : ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచంలో విప్లవం సృష్టిస్తున్న అమెరికన్ కంపెనీ ఓపెన్‌ఏఐ (OpenAI), ఇప్పుడు ఒక పెద్ద డీల్‌కు రెడీ అవుతుంది. ఓపెన్‌ఏఐ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భారతదేశపు ధనవంతుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF), యూఏఈకి చెందిన MGX వంటి సంస్థలు ఉన్నాయి. అంటే, ముకేశ్ అంబానీ ఎలాన్ మస్క్‌కు అతిపెద్ద ప్రత్యర్థి అయిన శ్యామ్ ఆల్ట్‌మాన్తో చేతులు కలిపే అవకాశం ఉంది. ఈ డీల్ విలువ సుమారు రూ.3.4 లక్షల కోట్లు వరకు ఉండవచ్చు. ఇందులో పెద్ద మొత్తం ఓపెన్‌ఏఐ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ స్టార్‌గేట్ కోసం నిధులు సేకరించడానికి ఉపయోగపడుతుంది.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఓపెన్‌ఏఐ కంపెనీ సహ-వ్యవస్థాపకుడు శ్యామ్ ఆల్ట్‌మాన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన సమయంలోనే ఈ డీల్ గురించి సమాచారం వెలుగులోకి రావడం గమనార్హం. మస్క్ ఇటీవల ఓపెన్‌ఏఐపై కేసు పెట్టారు. కంపెనీ వ్యాపార వ్యూహాలపై ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో శ్యామ్ ఆల్ట్‌మాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులతో కలిసి ఓపెన్‌ఏఐని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఈ జాబితాలో ముకేశ్ అంబానీ పేరు అందరికంటే ముందుంది.

శ్యామ్ ఆల్ట్‌మాన్ ఇటీవల భారతదేశ ఐటీ మంత్రితో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేశంలో AI పర్యావరణ వ్యవస్థను విస్తరించే విషయంపై చర్చ జరిగింది. ఒకవేళ ఈ డీల్ జరిగితే, సాంకేతిక ఆవిష్కరణల విషయంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో మరింత బలంగా ఎదుగుతుంది. ఓపెన్‌ఏఐకి నిధులు సేకరించే ఈ రౌండ్‌కు జపాన్‌కు చెందిన దిగ్గజ టెక్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్ నాయకత్వం వహిస్తోంది. స్టార్‌గేట్ అనే ప్రాజెక్ట్‌కు అవసరమైన డేటా సెంటర్‌లు, సూపర్ కంప్యూటర్‌ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఒక్కటే 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఈ డీల్ నిజమైతే ఇది కేవలం భారతదేశంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్కు మాత్రమే కాకుండా, టెక్నాలజీ ప్రపంచంలో భారతదేశం అత్యంత ముఖ్యమైనదిగా మారనుంది.

Tags:    

Similar News