FSSAI India : దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. కల్తీగాళ్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉక్కుపాదం.. రూ.154 కోట్ల జరిమానా

రూ.154 కోట్ల జరిమానా

Update: 2026-04-09 08:53 GMT

FSSAI India : దేశవ్యాప్తంగా మనం తినే ఆహారం ఎంతవరకు సురక్షితం? హోటళ్లు, రెస్టారెంట్లు, చివరకు రోడ్డు పక్కన బండ్ల మీద అమ్మే తిండి నాణ్యతగా ఉందా? దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కన్నువేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడటమే కాదు, భారీగా జరిమానాలు కూడా పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆహార భద్రతను మెరుగుపరచడానికి FSSAI నడుం బిగించింది. ఈ ఏడాది ఏకంగా 3.97 లక్షల ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దాదాపు 1.65 లక్షల ఆహార నమూనాలను ల్యాబ్‌లకు పంపి పరీక్షించగా, అందులో 17 శాతం నమూనాలు నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. అంటే మనం తినే ఐదు పదార్థాలలో ఒకటి కచ్చితంగా కల్తీ లేదా తక్కువ నాణ్యతతో ఉంటోందని అర్థం.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం కనికరం చూపలేదు. మొత్తం 23,580 కేసులను పరిష్కరించగా, 1,756 కేసుల్లో దోషులకు కఠిన శిక్షలు పడ్డాయి. నిబంధనలు తుంగలో తొక్కిన వ్యాపారుల నుంచి రూ.154.87 కోట్ల భారీ జరిమానాను వసూలు చేశారు. అంతేకాకుండా, ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఉన్న సుమారు 945 రకాల ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి పిలిపించారు.

రోడ్డు పక్కన దొరికే స్ట్రీట్ ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ అక్కడ శుభ్రతపై ఎప్పుడూ అనుమానాలు ఉంటాయి. దీన్ని అరికట్టేందుకు 10 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులను నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చారు. వీరికి లైసెన్సింగ్, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఇకపై టర్నోవర్‌ను బట్టి రూ.1.5 కోట్ల లోపు ఉంటే బేసిక్ రిజిస్ట్రేషన్, రూ.50 కోట్ల లోపు ఉంటే స్టేట్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి చేశారు.

ఆహార పరీక్షలను వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో కలిపి మొత్తం 18 కొత్త అత్యాధునిక ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చారు. దీనివల్ల నమూనాల ఫలితాలు త్వరగా వచ్చి, కల్తీని వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. రాష్ట్రాల్లోని జిల్లా స్థాయి అధికారులకు కూడా తనిఖీలు, ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎఫ్ఎస్ఎస్ఏఐ అంతర్గత సమాచారం సోషల్ మీడియాలో లీక్ అవ్వడంపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇది మీడియా గొంతు నొక్కడానికి కాదని, ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టిన అజ్ఞాత వ్యక్తులను పట్టుకోవడానికేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. విచారణలో ఉన్న కీలక అంశాలు బయటకు రావడం వల్ల అసలైన దోషులు తప్పించుకునే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News