GST 2.0 : జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ డైరీ ఉత్పత్తులు ఇప్పుడు మరింత చవక!
ఈ డైరీ ఉత్పత్తులు ఇప్పుడు మరింత చవక!
GST 2.0 : జీఎస్టీలో మార్పుల తర్వాత చాలా పాల, డైరీ ఉత్పత్తుల ధరలు తగ్గాయి. చీజ్, వెన్న, నెయ్యి, పన్నీర్, కండెన్స్‌డ్ మిల్క్, ఐస్‌క్రీమ్ వంటి డైరీ ఉత్పత్తుల ధరలు 5 నుంచి 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. పండుగల సీజన్ ముందు జీఎస్టీ తగ్గించడం వల్ల, ఆ లాభాన్ని వినియోగదారులకు చేరవేయడానికి డైరీ పరిశ్రమ సిద్ధమైంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని మార్పులు చేశారు అవి సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తాయి.
ఏ ఉత్పత్తుల ధరలు తగ్గాయి?
యూహెచ్‌టీ(అల్ట్రా-హై టెంపరేచర్) పాలు, ప్యాక్ చేసిన పన్నీర్లపై జీఎస్టీని సున్నాకి తగ్గించారు. దీనివల్ల దేశంలో డైరీ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందని, అలాగే కల్తీ, పన్నుల చోరీ తగ్గుతుందని డైరీ ఇండస్ట్రీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కండెన్స్‌డ్ మిల్క్, వెన్న, చీజ్, నెయ్యి, బటర్ ఆయిల్, పాలతో తయారైన పానీయాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. యూహెచ్‌టీ పాలు, ప్యాక్ చేసిన పన్నీర్ పై జీఎస్టీని 5% నుంచి సున్నాకి తగ్గించారు. కోకో పౌడర్, చాక్లెట్లు, కోకోతో తయారైన ఇతర ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించారు.
కొత్త జీఎస్టీ రేట్ల జాబితా
కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం, యూహెచ్‌టీ పాలు, ప్యాక్ చేసిన పన్నీర్ జీఎస్టీ సున్నాకి తగ్గాయి. కండెన్స్‌డ్ మిల్క్, సోయా మిల్క్ డ్రింక్స్, పాలతో తయారైన పానీయాలు, మొక్కల నుంచి తయారైన పాలు, ఇనుము, స్టీల్, అల్యూమినియం పాల డబ్బాలపై జీఎస్టీ 12% లేదా 18% నుంచి 5%కి తగ్గింది. అలాగే, పిజ్జా బ్రెడ్, వెన్న, నెయ్యి, చీజ్‌లపై కూడా పన్ను రేట్లు తగ్గాయి.
డైరీ షేర్లలో పెరుగుదల
జీఎస్టీ తగ్గింపు ప్రకటన తర్వాత, వ్యవసాయం, డైరీ రంగానికి సంబంధించిన షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. పరాగ్ మిల్క్ ఫుడ్స్ షేర్ 7.4% పెరిగి రూ.263.50కు చేరింది. డోడ్లా డైరీ షేర్లు 4.5% పెరిగి రూ.1,498.85కు చేరుకున్నాయి. డైరీ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు వల్ల యూహెచ్‌టీ పాలు, పన్నీర్, వెన్న, నెయ్యిపై ట్యాక్స్ తగ్గింది. ఈ లాభం వినియోగదారులకు నేరుగా అందుతుంది. మదర్ డైరీ ఈ లాభాన్ని వినియోగదారులకు అందించడానికి సిద్ధంగా ఉంది. అమూల్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి, ఈ నిర్ణయం డైరీ రంగానికి లాభం చేకూరుస్తుందని తెలిపింది.