NITI Aayog Report : అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి దేశంలో నంబర్ 3గా నిలిచిన తెలంగాణ..ఆ రంగంలో మనమే టాప్
ఆ రంగంలో మనమే టాప్
NITI Aayog Report : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సర్వీస్ రంగం ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. 2011 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో సర్వీస్ రంగం అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. జాతీయ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ సర్వీస్ రంగం వాటా 10 శాతం పెరగడం ద్వారా సర్వీస్ గ్రాస్ వాల్యూ యాడెడ్ పరంగా తెలంగాణ అన్ని రాష్ట్రాలలో మూడో స్థానంలోకి దూసుకువచ్చింది.
నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన రాష్ట్రాల ఆర్థిక పనితీరు నివేదికలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సర్వీస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ నిలిచింది. 2011-12, 2023-24 మధ్య కాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణ సర్వీస్ సెక్టార్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సర్వీస్ రంగం వాటా 10 శాతం పెరిగింది.
ఈ కారణంగా రాష్ట్ర సర్వీస్ రంగం జాతీయ జీఎస్టీలో అందించే వాటా పరంగా తెలంగాణ అన్ని రాష్ట్రాలలో మూడో స్థానానికి దూసుకువచ్చింది. గత దశాబ్ద కాలంలో భారతదేశ ఆర్థిక వృద్ధి వ్యవసాయం లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కంటే ఎక్కువగా సేవల పైనే ఆధారపడింది. ఈ మార్పు తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపించింది. 2011-12లో తెలంగాణలో సర్వీస్ సెక్టార్ వాటా 52.8 శాతం ఉండగా, అది 2023-24 నాటికి ఏకంగా 62.4 శాతానికి పెరిగింది. ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో, అధిక విలువ గల ఉద్యోగాలను సృష్టించడంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాన్ని సూచిస్తుంది.
ఈ వృద్ధి ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలలో ఎక్కువగా ఉంది. కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ వృద్ధికి నాయకత్వం వహిస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఈ విషయంలో వెనుకబడింది. తెలంగాణ ఈ అనూహ్యమైన ఆర్థిక పురోగతి సాధించడం వెనుక టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్లు కీలకంగా నిలిచాయి. ఐటీ, డిజిటల్ పరిశ్రమల్లో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌షిప్‌ను కలిగి ఉంది. ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టడం వల్ల తెలంగాణ వేగవంతమైన ఆర్థిక మార్పుకు గురైంది. సర్వీస్ రంగంలో దేశంలోనే ఆధిపత్యం కొనసాగిస్తున్న కర్ణాటక వాటా 56.8% నుంచి 65.9%కి పెరిగింది. కేరళ 57.5% నుంచి 64.3%కి పెరిగింది. తమిళనాడు వృద్ధి 50.5% నుంచి 51.7%కి పెరిగింది.