Flex Fuel : మొక్కజొన్నతో మారిన రైతుల రాత.. క్వింటాల్ ధర ఏకంగా రూ.2,800కు పెరిగిందన్న నితిన్ గడ్కరీ
రూ.2,800కు పెరిగిందన్న నితిన్ గడ్కరీ
Flex Fuel : భారతదేశంలో సాంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ పర్యావరణ అనుకూల ఇంధనాలను ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం దేశీయ రైతులకు వరంగా మారిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి ముందు మార్కెట్లో మొక్కజొన్న ధర క్వింటాలుకు కేవలం రూ.1,200 మాత్రమే ఉండేదని, కనీస మద్దతు ధర రూ.1,800గా ఉన్నప్పటికీ రైతులకు సరైన లాభాలు వచ్చేవి కావని ఆయన గుర్తు చేశారు. అయితే ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత మార్కెట్లో మొక్కజొన్న డిమాండ్ పెరిగి ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.2,800కి చేరిందని, దీనివల్ల ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల రైతులు ఏకంగా రూ.45,000 కోట్ల అదనపు లబ్ధిని పొందారని మంత్రి వెల్లడించారు.
బయోఫ్యూయల్స్ వాడకాన్ని మరింత విస్తృతం చేయడానికి కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపట్టింది. అందుకోసం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 నిబంధనలలో కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశంలో అన్ని రకాల కేటగిరీల వాహనాలలో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్ల వాడకాన్ని తప్పనిసరి చేయనున్నారు. భవిష్యత్తులో పెట్రోల్‌లో 85 శాతం ఇథనాల్ కలిపిన E85 ఇంధనంతో పాటు, వంద శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడిచే E100 వాహనాలు, అలాగే B100 బయోడీజిల్, హైడ్రోజన్-సీఎన్‌జీ మిశ్రమాలను వాడటానికి వీలుగా ఈ చట్ట సవరణలు దోహదపడనున్నాయి.
న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలపై భారతదేశం ఎక్కువగా ఆధారపడటం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశం ముడి చమురు దిగుమతుల కోసమే ఏటా రూ.22 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చిస్తోందని పేర్కొన్నారు. ఇది దేశానికి భారీ ఆర్థిక భారమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు. కాబట్టి దేశం మరింత ప్రగతి సాధించాలంటే స్వచ్ఛమైన, దేశీయంగా తయారయ్యే హరిత ఇంధనాన్ని స్వీకరించడం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశం ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 లక్ష్యాన్ని విజయవంతంగా సాధించిందని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. దీనివల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. అయితే ఈ20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజన్లు పాడైపోతాయంటూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో ఈ20 ఇంధనం వల్ల కారు చెడిపోయిన ఒక్క కేసునైనా చూపించాలని విమర్శకులకు బహిరంగ సవాల్ విసిరారు. సొంత లాభాల కోసం చూసే కొందరు వ్యక్తులు మాత్రమే ఇథనాల్ బ్లెండింగ్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం భారతదేశంలోని పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు వేర్వేరు ఇంధనాలను ఎంచుకునే సదుపాయం లేదు. కానీ బ్రెజిల్ వంటి దేశాలలో వాహనదారులు తమ బడ్జెట్ మరియు ఇష్టానుసారం వేర్వేరు ధరలలో లభించే ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఎంచుకోవచ్చు. అక్కడ ఎక్కువ ఇథనాల్ ఉన్న ఇంధనానికి పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. త్వరలోనే భారతదేశంలో కూడా అటువంటి మార్పులు వస్తాయన్నారు. ఇక తన కుటుంబ సభ్యుల చక్కెర మిల్లుల గురించిన ఆరోపణలపై స్పందిస్తూ.. తమ కుటుంబ వ్యాపారాలు ఏవీ ఇథనాల్ ఉత్పత్తిపై ఆధారపడలేదని, దేశ ప్రయోజనాల కోసమే తాను ఇథనాల్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.