NPS Pensioners : పెన్షనర్లకు గుడ్ న్యూస్.. మెడికల్ అలవెన్స్ రూల్స్ మార్చిన కేంద్రం
మెడికల్ అలవెన్స్ రూల్స్ మార్చిన కేంద్రం
NPS Pensioners : కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఊరటనిచ్చే వార్త. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెన్షన్ పొందుతున్న వారి కోసం మెడికల్ అలవెన్స్ నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఆసుపత్రి బిల్లులు సమర్పించి, ఆమోదం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ (FMA) కింద నిర్ణీత మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకే జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 16, 2026న ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఏమిటీ మార్పు?
గతంలో ఎన్‌పిఎస్ పెన్షనర్లు వైద్య ఖర్చుల కోసం బిల్లులు సమర్పించి, రీయింబర్స్‌మెంట్ కోసం వేచి ఉండాల్సి వచ్చేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ (FMA) పొందడానికి అర్హులైన పెన్షనర్లు ఎటువంటి బిల్లులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆటోమేటిక్ చేసింది. పెన్షన్ ఇచ్చే బ్యాంకుల ద్వారానే ఈ సొమ్ము నేరుగా పెన్షనర్ల ఖాతాల్లోకి చేరుతుంది.
ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లింపు
ఈ కొత్త విధానంలో సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (CPAO) మొదట పెన్షనర్ అర్హతను తనిఖీ చేస్తుంది. అంతా సవ్యంగా ఉంటే బ్యాంకులకు ప్రత్యేక అనుమతి జారీ చేస్తుంది. ఆ తర్వాత బ్యాంకులు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్ణీత మెడికల్ అలవెన్స్ మొత్తాన్ని పెన్షనర్ ఖాతాలో జమ చేస్తాయి. దీనివల్ల కాగితపు పని తగ్గుతుంది. వృద్ధులకు ప్రయాస తప్పుతుంది.
లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి
ఈ సౌకర్యం నిరంతరాయంగా కొనసాగాలంటే పెన్షనర్లు ఒక నిబంధనను మాత్రం కచ్చితంగా పాటించాలి. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. దీనిని ఫిజికల్‌గా లేదా డిజిటల్‌గా అందజేయవచ్చు. ఒకవేళ ఎవరైనా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడం మర్చిపోతే, డిసెంబర్ నుంచి మెడికల్ అలవెన్స్ చెల్లింపులు నిలిచిపోతాయి. మళ్లీ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతే ఈ సదుపాయం పునరుద్ధరించబడుతుంది.
CGHS కు మారే అవకాశం:
ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ వద్దనుకునే వారు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) కింద ఓపిడి సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. అయితే, ఈ రెండింటిలో ఏదో ఒక దానిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెన్షనర్ తన బ్యాంకు బ్రాంచ్‌ను మార్చుకున్నా, ఈ నగదు బదిలీ ప్రక్రియలో ఎటువంటి ఆటంకం కలగకుండా CPAO తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.
కుటుంబ సభ్యులకు కూడా లబ్ధి
పెన్షనర్ మరణించిన తర్వాత కూడా ఈ మెడికల్ అలవెన్స్ సదుపాయం అర్హులైన కుటుంబ సభ్యులకు అందుతుంది. కుటుంబ సభ్యుల పేరు పెన్షన్ రికార్డుల్లో ఉంటే, వారు నేరుగా డెత్ సర్టిఫికెట్ సమర్పించి ఈ సదుపాయాన్ని పొందవచ్చు. పేరు లేని పక్షంలో సంబంధిత విభాగం నుంచి కొత్తగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వృద్ధులకు సామాజిక భద్రత కల్పించడంలో ఈ నిర్ణయం మైలురాయిగా నిలవనుంది.