Tata Group: టాటా సామ్రాజ్యంలో కొత్త శకం.. బాంబే హౌస్ బాస్ ఎవరో తేల్చనున్న నోయెల్ టాటా!
బాంబే హౌస్ బాస్ ఎవరో తేల్చనున్న నోయెల్ టాటా!
Tata Group: సుదీర్ఘ కాలం పాటు ప్రచారానికి దూరంగా ఉంటూ వ్యాపారాలను నడిపించిన నోయెల్ టాటా ఇప్పుడు గ్రూప్ భవిష్యత్తును నిర్దేశించే ప్రధాన శక్తిగా మారారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ రెండో విడత పదవీకాలం ముగిసిన తర్వాత తదుపరి వారసుడి వేట మొదలైంది. టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్‌కు బాస్‌గా ఉండటంతో, కొత్త ఛైర్మన్ ఎంపికలో నోయెల్ సంతకం అత్యంత కీలకం కానుంది. ఒకప్పుడు రతన్ టాటా నీడలో ఉంటూ సైలెంట్ లీడర్‌గా పేరొందిన నోయెల్, ఇప్పుడు బిలియన్ డాలర్ల టాటా సామ్రాజ్యానికి కొత్త రథసారధిని ఎన్నుకునే గురుతర బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు.
ట్రెంట్ విజయం నుంచి టాటా ట్రస్ట్స్ పీఠం వరకు
1956 నవంబర్ 12న నావల్, సిమోన్ టాటా దంపతులకు జన్మించిన నోయెల్ టాటా, బ్రిటన్ లోని ససెక్స్ యూనివర్సిటీ లో విద్యనభ్యసించారు. ట్రెంట్ సంస్థను ఒక్క స్టోర్ స్థాయి నుంచి జుడియో, వెస్ట్‌సైడ్ బ్రాండ్లతో 700కి పైగా స్టోర్లు ఉన్న రూ. 20,000 కోట్ల భారీ కంపెనీగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. టాటా ఇంటర్నేషనల్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో దాని రాబడిని 500 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు పెంచారు. రతన్ టాటా అస్తమయం తర్వాత అక్టోబర్ 2024 లో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి, టాటా సన్స్ బోర్డులో చేరడం ఆయన ప్రస్థానంలో అతిపెద్ద మలుపు.
చంద్రశేఖరన్‌తో వ్యూహాత్మక చర్చలు
సమూహం భవిష్యత్తు వ్యూహాలపై నోయెల్ స్పష్టమైన వైఖరితో ముందడుగు వేస్తున్నారు. చంద్రశేఖరన్ పదవీకాలంపై చర్చల సందర్భంలో, రాబోయే ఐదేళ్ల వ్యూహాత్మక రోడ్‌మ్యాప్ తో పాటు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు ఎగ్జిట్ ఆప్షన్, టాటా సన్స్ లిస్టింగ్ వ్యవహారాలపై నోయెల్ కీలక ప్రశ్నలు సంధించారు. ఎయిర్ ఇండియా, బిగ్‌బాస్కెట్ వంటి నూతన వ్యాపారాల్లో వస్తున్న నష్టాలు, భారీ మూలధన అవసరాలపై బోర్డు సమావేశాల్లో తన ఆందోళన వ్యక్తం చేస్తూనే, గ్రూప్ లాభదాయకతకు ప్రాధాన్యమిచ్చారు.
70 ఏళ్ల వయస్సు.. చెక్కుచెదరని అధికారం
త్వరలోనే 70 ఏళ్లు నిండనున్న నేపథ్యంలో టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం ఆయన ట్రెంట్, టాటా స్టీల్, టైటాన్, వోల్టాస్ వంటి ఆరు ప్రధాన కంపెనీల బోర్డుల నుంచి నిష్క్రమించనున్నారు. అయినప్పటికీ టాటా సన్స్ బోర్డు డైరెక్టర్‌గా ఆయన కొనసాగుతారు. ఎందుకంటే ట్రస్ట్ నామినీలకు రిటైర్మెంట్ వయోపరిమితి వర్తించదు. ఈ నిబంధన వల్ల బాంబే హౌస్‌పై ఆయన పట్టు మరింత బలపడనుంది.