NPS : ఎన్‌పీఎస్ ఖాతాదారులకు కేంద్రం భారీ ఊరట.. ఇకపై ఎక్కువ రిటర్న్స్ పొందే గోల్డెన్ ఛాన్స్
ఎక్కువ రిటర్న్స్ పొందే గోల్డెన్ ఛాన్స్
NPS : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ద్వారా రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ స్వయంప్రతిపత్తి సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పెట్టుబడుల విషయంలో మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేలా కేంద్రం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సంస్థల ఉద్యోగులు కూడా ఎక్కువ రిటర్న్స్ లేదా లాభాలను అందించే రెండు అదనపు పెట్టుబడి మార్గాలను ఎంచుకోవచ్చని ప్రకటించింది. గతంలో ఈ ప్రత్యేక సదుపాయం కేవలం కోర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ కొత్త మార్పుల వల్ల ఉద్యోగులకు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యం మరియు రిటైర్మెంట్ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులను మళ్లించుకునే పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
ఈ సరికొత్త నిర్ణయానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జూలై 1, 2026 న అధికారికంగా ఒక ఆఫీసు మెమోరాండం విడుదల చేసింది. గతంలో ఆర్థిక సేవల విభాగం నవంబర్ 13, 2025న జారీ చేసిన నోటిఫికేషన్ పరిధిని మరింత విస్తరిస్తూ ఈ కొత్త జీవోను తెచ్చారు. దీని ప్రకారం సెంట్రల్ అటానమస్ బాడీస్‌కు చెందిన ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు అందరూ ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గరిష్ట లాభాలు ఇచ్చే ఫండ్లలోకి తమ సొమ్మును మార్చుకోవచ్చు.
ఆ రెండు కొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఇవే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కొత్త ఆప్షన్లలో మొదటిది LC-75-High. దీనిని గతంలో అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్ అని పిలిచేవారు. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఉద్యోగి ఎన్‌పీఎస్ సొమ్ములో గరిష్టంగా 75 శాతం వరకు నేరుగా ఈక్విటీ అంటే షేర్ మార్కెట్ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టవచ్చు. వయసు తక్కువగా ఉండి, సుదీర్ఘ కాలం పాటు పెట్టుబడి పెడుతూ ఎక్కువ రిటర్న్స్ కోసం రిస్క్ తీసుకోగల యువ ఉద్యోగులకు ఇది సరైన ఆప్షన్. ఇక రెండవది, గతంలో బ్యాలెన్స్‌డ్ లైఫ్ సైకిల్ ఫండ్ గా పిలవబడిన సరికొత్త ఫండ్. దీని ద్వారా గరిష్టంగా 50 శాతం వరకు నిధులను ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది, ఉద్యోగికి 45 ఏళ్లు దాటిన తర్వాత ఈక్విటీ షేర్ల శాతం క్రమంగా తగ్గుతూ ప్రభుత్వ బాండ్లలోకి మారుతుంది, తద్వారా రిటైర్మెంట్ నాటికి పెట్టుబడి చాలా సురక్షితంగా మారుతుంది.
మరింత పెరగనున్న ఎన్‌పీఎస్ ఆకర్షణ
ఈ కొత్త విధానాల వల్ల ఎన్‌పీఎస్ పథకం మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా మరియు ఫ్లెక్సిబుల్‌గా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఏ ఉద్యోగి అయినా తమ పెట్టుబడుల మార్పుపై స్వయంగా నిర్ణయం తీసుకోలేకపోతే, వారి కోసం పాత పద్ధతిలోనే Auto Choice సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఆటో ఛాయిస్ విధానంలో ఇన్వెస్టర్ వయసు పెరిగే కొద్దీ ఈక్విటీ, కార్పొరేట్ బాండ్ల నిష్పత్తి సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ప్రస్తుతం ఎన్‌పీఎస్ లో లైఫ్ సైకిల్ 25 , లైఫ్ సైకిల్ 50, లైఫ్ సైకిల్ 75 వంటి ఆటో ఛాయిస్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ తాజా నిర్ణయంతో అటానమస్ బాడీస్ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ కాలానికి భారీ నిధిని సులభంగా కూడబెట్టుకోవచ్చు.