NPS : రిటైర్మెంట్ పొదుపులోనే హెల్త్ ఇన్సూరెన్స్.. పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త మాస్టర్ ప్లాన్
పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త మాస్టర్ ప్లాన్
NPS : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ద్వారా రిటైర్మెంట్ కోసం పొదుపు చేసే వారికి త్వరలో ఒక అదిరిపోయే వార్త అందనుంది. ఇకపై మీరు పొదుపు చేసే పెన్షన్ డబ్బుతోనే ముసలితనంలో ఆరోగ్య భద్రతను కూడా పొందే సరికొత్త విధానం రాబోతోంది. పెన్షన్ నిధుల నియంత్రణ సంస్థ (PFRDA) చైర్మన్ ఎస్.రామన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పెన్షన్ డబ్బులను హెల్త్ ఇన్సూరెన్స్‌తో ముడిపెట్టే సరికొత్త పథకాలపై ఐసీఐసీఐ, యాక్సిస్, టాటా వంటి దిగ్గజ పెన్షన్ ఫండ్ మేనేజర్లు కసరత్తు చేస్తున్నారు.
ఏమిటీ మెడికల్ పెన్షన్ కాన్సెప్ట్?
సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత మనిషికి ఎదురయ్యే అతిపెద్ద ఖర్చు వైద్యమే. దీనిని దృష్టిలో ఉంచుకుని, పెన్షన్ పొదుపులో దాదాపు 30 శాతం మొత్తాన్ని కేవలం వైద్య అవసరాల కోసం మాత్రమే కేటాయించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మెడికల్ పెన్షన్ ఫండ్ సిద్ధంగా ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన హెల్త్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ మార్పులు చేస్తున్నారు.
తక్కువ ధరకే హెల్త్ ఇన్సూరెన్స్.. మెరుగైన చికిత్స
ఎన్‌పీఎస్‌లో కోట్ల సంఖ్యలో ఇన్వెస్టర్లు ఉండటం వల్ల, పెన్షన్ ఫండ్ సంస్థలు నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీలతో, ఆసుపత్రులతో బేరసారాలు ఆడవచ్చు. దీనివల్ల వ్యక్తిగత పాలసీల కంటే చాలా తక్కువ ప్రీమియంతో హెల్త్ ఇన్సూరెన్స్ టాప్-అప్‌లు లభిస్తాయి. అంతేకాకుండా, ఆసుపత్రులకు చెల్లింపులు తక్షణమే జరుగుతాయి కాబట్టి, రోగులకు మెరుగైన చికిత్స, ఆఫర్లు లభించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పేమెంట్స్ ఆలస్యం అవుతుంటాయి. కానీ ఈ మెడికల్ పెన్షన్ ద్వారా ఆసుపత్రులకు వెంటనే నగదు అందుతుంది.
నాలుగు సంస్థలు.. కొత్త ప్రయోగాలు
ప్రస్తుతానికి ఐసీఐసీఐ, యాక్సిస్, టాటా గ్రూప్ మద్దతు ఉన్న పెన్షన్ ఫండ్‌లు ఈ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేయడానికి ప్రయోగాలు చేస్తున్నాయి. త్వరలోనే ఐసీఐసీఐ నుంచి మొదటి ప్రొడక్ట్ బయటకు వచ్చే అవకాశం ఉందని రామన్ తెలిపారు. ఇవే కాకుండా యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టార్ దైచీ వంటి మరికొన్ని బ్యాంకులు కూడా పెన్షన్ ఫండ్ వ్యాపారంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
పెట్టుబడులపై మెరుగైన రాబడి
పెన్షన్ డబ్బులపై రెండెంకల రాబడిని దీర్ఘకాలం కొనసాగించడం కోసం ప్రభుత్వం కొత్త మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ మరియు బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వంటి వాటిల్లో కూడా కొంత శాతం పెట్టుబడులు పెట్టడానికి అనుమతి ఇస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌పీఎస్ వినియోగదారులు కేవలం కోటి మంది మాత్రమే ఉన్నారని, ఈ సంఖ్యను పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పని చేస్తున్నామని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది.