NPS Withdrawal Rules : ఎన్‌పీఎస్ అకౌంట్ ఉందా? మీ డబ్బును పన్ను లేకుండా వెనక్కి తీసుకోవడం ఎలా?

మీ డబ్బును పన్ను లేకుండా వెనక్కి తీసుకోవడం ఎలా?

Update: 2026-02-20 12:00 GMT

NPS Withdrawal Rules : రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కోసం చాలామంది నేషనల్ పెన్షన్ సిస్టమ్‎లో పెట్టుబడి పెడుతుంటారు. అయితే, రిటైర్ అయ్యాక ఆ డబ్బును ఎలా తీసుకోవాలి? ఒకేసారి మొత్తం వెనక్కి తీసుకోవచ్చా? లేక పెన్షన్ రూపంలో పొందాలా? అనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. ఎన్‌పీఎస్ నుంచి ఇప్పుడు 80% వరకు నగదును విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన నిబంధనలు, ముఖ్యంగా యాన్యుటీ రూల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ దగ్గర ఉన్న మొత్తం ఫండ్ ఆధారంగా మీకు లభించే ఆప్షన్లు మారుతుంటాయి.

మీ రిటైర్మెంట్ ఫండ్ ఎంత ఉందనే దానిపైనే విత్ డ్రా ఆప్షన్లు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర రూ.8 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, మొత్తం సొమ్మును ఒకేసారి తీసుకోవచ్చు. ఒకవేళ రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉంటే, రూ.6 లక్షల వరకు ఒకేసారి తీసుకుని, మిగిలిన డబ్బును కనీసం 6 ఏళ్ల పాటు పెన్షన్ రూపంలో తీసుకోవాలి. అదే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఉంటే (ప్రైవేట్ ఉద్యోగులకు), 80% వరకు నగదు తీసుకోవచ్చు కానీ, మిగిలిన 20% తప్పనిసరిగా అన్యుటీలో పెట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులకైతే కనీసం 40% అన్యుటీలో ఉంచడం తప్పనిసరి.

ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది SLW, SUR మధ్య తేడా. SLW అంటే ప్రతి నెల మీకు ఒక స్థిరమైన మొత్తం (ఉదాహరణకు రూ.50,000) అందుతుంది. మార్కెట్ ఎలా ఉన్నా మీకు వచ్చే డబ్బు మారదు. అదే SUR ఆప్షన్‌లో ప్రతి నెల కొన్ని నిర్దిష్టమైన యూనిట్లు అమ్ముడవుతాయి. దీనివల్ల మీకు వచ్చే అమౌంట్ మార్కెట్ ఒడిదుడుకులను బట్టి మారుతుంటుంది. మార్కెట్ బాగుంటే ఎక్కువ డబ్బు, పడిపోతే తక్కువ డబ్బు వస్తుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా వీటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి.

ఒకవేళ మార్కెట్ పడిపోతే ఏమవుతుందనే భయం చాలామందిలో ఉంటుంది. SLWలో మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లు అమ్ముడవుతాయి కాబట్టి మీ ఫండ్ త్వరగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. SURలో యూనిట్లు సురక్షితంగా ఉంటాయి కానీ, మీ నెలవారీ ఆదాయం తగ్గొచ్చు. మీకు వేరే ఆదాయం లేకపోతే SLW ఉత్తమం, అలా కాకుండా మీకు అద్దెలు లేదా ఇతర పెన్షన్లు వస్తుంటే SUR దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉంటుంది.

చివరగా టాక్స్ విషయానికి వస్తే.. ఎన్‌పీఎస్ నుంచి 60% వరకు విత్ డ్రా చేసుకుంటే టాక్స్ ఉండదు, అంతకు మించితే పన్ను వర్తించే అవకాశం ఉంది. తెలివైన రిటైర్మెంట్ ప్లాన్ అంటే.. కనీసం 6 నుంచి 12 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును సేవింగ్స్ అకౌంట్ లేదా ఎఫ్డీలో విడిగా ఉంచుకోవడం (బకెట్ స్ట్రాటజీ). దీనివల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. మీ వయస్సు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఇతర ఆదాయ వనరులను బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి.

Tags:    

Similar News