NRI Deposits: మాతృభూమిపై ప్రవాస భారతీయులు తమకున్న నమ్మకాన్ని మరోసారి చాటుకున్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన ప్రత్యేక విదేశీ కరెన్సీ డిపాజిట్ పథకానికి ఎన్నారైల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభించింది. ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు భారతీయ బ్యాంకుల్లో జమకావడంతో ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్న వేళ భారత రిజర్వ్ బ్యాంక్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దేశంలో విదేశీ మార్పిడి నిల్వలు తగ్గకుండా ఉండేందుకు, రూపాయి విలువకు కొండంత అండగా నిలిచేందుకు ప్రత్యేక డాలర్-రూపాయి ఫారిన్ కరెన్సీ స్వాప్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూన్ 8న ప్రారంభమైన ఈ పథకానికి ప్రవాస భారతీయుల నుంచి బ్రహ్మరథం లభించింది. ఏకంగా 136.377 బిలియన్ డాలర్ల ఆస్తులు విదేశాల నుంచి భారత వ్యవస్థలోకి ప్రవేశించాయి.

ఎఫ్సీఎన్ఆర్ (B) పేరుతో ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని ముందుగా ప్రకటించారు. అయితే ఎన్నారైలు చూపించిన అపారమైన ఆదరణ కారణంగా నిర్ణీత గడువు కంటే నెల రోజుల ముందే అంటే ఆగస్టు 31 నాటికే ఈ పథకాన్ని ఆర్బీఐ నిలిపివేసింది. నిర్దేశించుకున్న లక్ష్యాలు అనుకున్న సమయం కంటే ముందే నెరవేరడమే ఇందుకు ప్రధాన కారణం. ఒక్క ఎఫ్సీఎన్ఆర్ (B) రూపంలోనే ఏకంగా 127.226 బిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.12 లక్షల కోట్లకు పైగా సొమ్ము బ్యాంకుల్లోకి చేరింది.

ఎందుకు ఈ స్కీమ్ పట్ల అంత క్రేజ్?

ఎఫ్సీఎన్ఆర్ (B) అంటే ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) డిపాజిట్లు. ఇవి విదేశీ కరెన్సీలోనే దాచుకునే టర్మ్ డిపాజిట్ రకాలు. ఇందులో అసలు కరెన్సీ, దానిపై వచ్చే వడ్డీ రెండూ కూడా సదరు విదేశీ మారకం రూపంలోనే పొందే వెసులుబాటు ఉంటుంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేయడం, గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో డిపాజిట్లకు పూర్తి భద్రత ఉండటంతో ప్రవాస భారతీయులు భారీగా పెట్టుబడులు పెట్టారు. విదేశీ రుణాల ద్వారా మరో 5.26 బిలియన్ డాలర్లు, కమర్షియల్ బారోయింగ్స్ ద్వారా 3.891 బిలియన్ డాలర్లు మన దేశానికి వచ్చాయి.

భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి

దేశీయంగా బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ పెరగడమే కాకుండా, విదేశీ మారక ద్రవ్య నిల్వలు సర్వకాల గరిష్ఠాల వైపు దూసుకెళ్లేందుకు ఇది ఎంతో తోడ్పడింది. రూపాయి విలువపై విదేశీ విపణి ఒత్తిడిని తగ్గించడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషించాయి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను తట్టుకుని నిలబడే శక్తి భారత్‌కు ఉందని ఈ భారీ ఇన్ఫ్లో నిరూపించింది. ఇతర కమర్షియల్ విదేశీ రుణాల స్వ్యాపింగ్ సౌకర్యం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Tags: