Uber Layoffs: ఉబర్ ఉద్యోగులకు ఊహించని షాక్: ఏకంగా 3,300 మందిపై వేటు
ఏకంగా 3,300 మందిపై వేటు
Uber Layoffs: ప్రముఖ గ్లోబల్ రైడ్-హేలింగ్ దిగ్గజం ఉబర్ తన ఉద్యోగులకు కోలుకోలేని భారీ షాక్ ఇచ్చింది. కంపెనీలో పని చేస్తున్న మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఏకంగా 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,400 మంది తమ ఉద్యోగాలను కోల్పోతుండగా, భారతీయ ఉద్యోగుల్లోనూ తీవ్ర ఆందోళన మొదలైంది. గ్లోబల్ టెక్ రంగంలో మళ్లీ లేఆఫ్స్ భయాలు నిజమయ్యాయి. ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి సంస్థలోని అందరి సిబ్బందికి ఒక అత్యంత కీలకమైన అంతర్గత ఇమెయిల్ పంపారు. టీమ్ స్ట్రక్చర్‌ను సరళతరం చేయడం, అనవసరపు కార్పొరేట్ పొరలను తొలగించడానికే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ వేటు ప్రధానంగా కార్పొరేట్, టెక్ విభాగాల్లో పని చేసే వేలాది మంది ఉద్యోగులపై పడింది. అయితే ప్రస్తుత నిర్ణయం ఎలాంటి తక్షణ ఆర్థిక సంక్షోభం వల్ల కాదని, సంస్థలోని బ్యూరోక్రసీని తగ్గించి నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకేనని మేనేజ్‌మెంట్ చెబుతోంది.
భారత్‌పై ప్రభావం ఎంత?
ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు, 15,000లకు పైగా నగరాల్లో విస్తరించిన ఉబర్ సంస్థలో దాదాపు 34,000 మంది సిబ్బంది ఉన్నారు. ఈ తాజా లేఆఫ్స్ నుంచి భారతీయ విభాగాలు కూడా మినహాయింపు పొందలేదు. ఉబర్ ఇండియా ప్రతినిధి తెలిపిన సమాచారం ప్రకారం.. ఇక్కడ పనిచేస్తున్న కొందరి పాత్రలపై ఈ ప్రభావం స్పష్టంగా పడుతుంది. అయితే ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో తమ వ్యాపారాన్ని ముందుకు నడపడానికి భారతదేశం ఎప్పటికీ అత్యంత కీలకమైన మార్కెట్‌గానే ఉంటుందని, ఇక్కడి రీజినల్ ఆపరేషన్లను మరింత బలోపేతం చేస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
కారణాలు ఇవే..
పరిపాలనా రీత్యా పర్యవేక్షణ పాత్రలను గణనీయంగా తగ్గించడమే ఉబర్ లక్ష్యంగా పెట్టుకుంది. సీఈఓ స్థాయి నుంచి ఏడు లేదా అంతకంటే ఎక్కువ స్థానాల దిగువన ఉండే ఉద్యోగుల సంఖ్యను 20 శాతం మేర తగ్గించనున్నారు. కేవలం ఒకటి లేదా ఇద్దరు ఉద్యోగులతో నడిచే చిన్న చిన్న టీమ్‌ల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర తగ్గించేశారు. దీనికి తోడు ప్రస్తుతం నడుస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలుకుతూ ప్రతి ఒక్కరూ వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుండి పనిచేయాలని స్పష్టం చేశారు.
ఏఐ ఆటోమేషన్ పైనే దృష్టి!
మానవ వనరుల సంఖ్యను తగ్గించిన ఉబర్.. రాబోయే రోజుల్లో AI ఆధారిత ఆటోమేషన్ సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. లేఆఫ్స్‌కు గురైన వారికి తగిన పరిహారం ఇస్తామని, సెవెరెన్స్ ప్యాకేజీలు అందజేస్తామని ఉబర్ యాజమాన్యం వెల్లడించింది. టెక్ ప్రపంచంలో మళ్లీ ఆపరేషనల్ ఎఫిషియెన్సీ పేరుతో ఉద్యోగాలను కోసే ప్రక్రియ ప్రారంభమవడం మిగతా ఐటీ కంపెనీల ఉద్యోగులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.