Padma Awards 2026: బ్యాంకింగ్ నుంచి టెక్స్‌టైల్ వరకు..వ్యాపార దిగ్గజాలకు పద్మ గౌరవం
వ్యాపార దిగ్గజాలకు పద్మ గౌరవం
Padma Awards 2026: కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. దేశ సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వాములైన వివిధ రంగాల ప్రముఖులను ఈ గౌరవం వరించింది. ఈసారి మొత్తం 131 మందికి పద్మ అవార్డులు దక్కగా, అందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది వ్యాపార, పారిశ్రామిక రంగాల నుంచి దిగ్గజాలకు దక్కిన గుర్తింపు అందరినీ ఆకర్షిస్తోంది.
భారత ప్రభుత్వం ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేళ దేశ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రకటిస్తుంది. 2026 ఏడాదికి గాను వివిధ రంగాల్లో అసమాన ప్రతిభ కనబరిచిన 131 మందిని ఎంపిక చేశారు. రాజకీయ రంగం నుంచి కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్, సినీ రంగం నుంచి అలనాటి నటుడు ధర్మేంద్ర, జార్ఖండ్ ఉద్యమ నేత శిబు సోరెన్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్ గౌరవం లభించింది. అలాగే కళా రంగం నుంచి సింగర్ అల్కా యాగ్నిక్, దక్షిణాది మెగాస్టార్ మమ్ముట్టిలకు పద్మ భూషణ్ పురస్కారాలు ప్రకటించారు.
వ్యాపార, పారిశ్రామిక రంగంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన పలువురు ప్రముఖులకు ఈసారి విశేష గుర్తింపు లభించింది. ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ కు బ్యాంకింగ్ రంగంలో ఆయన చేసిన కృషికి గాను పద్మ భూషణ్ అవార్డు దక్కింది. రక్షణ రంగంలో స్వదేశీ మందుగుండు సామగ్రిని తయారు చేస్తూ భారత్‌ను స్వయం సమృద్ధం చేస్తున్న సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా చైర్మన్ సత్యనారాయణ నువాల్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది.
మరోవైపు భారత్‌లో ప్రతీ ఇంట్లోనూ సుపరిచితమైన పేరు టీటీకే గ్రూప్. ఈ సంస్థ అధినేత, ప్రెషర్ కుక్కర్ కింగ్‌గా పేరుగాంచిన టీటీ జగన్నాథన్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు. అలాగే దళిత పారిశ్రామికవేత్తగా కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అశోక్ ఖాడే, టెక్స్‌టైల్ రంగంతో పాటు సామాజిక సేవలో ముందున్న నీలేష్ మండలేవాలాలకు కూడా పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల ఎంపికలో కేవలం వ్యాపార లాభాలనే కాకుండా, వారు సమాజానికి చేసిన సేవను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. సామాన్యుల నుంచి అసమాన్యుల వరకు అందరినీ ఈ పురస్కారాలు గౌరవించాయి.