Pakistan : సౌదీ దెబ్బకు పాక్ విలవిల.. సూడాన్‌తో 42 వేల కోట్ల రక్షణ ఒప్పందం రద్దు

సూడాన్‌తో 42 వేల కోట్ల రక్షణ ఒప్పందం రద్దు

Update: 2026-04-21 08:36 GMT

Pakistan : పాకిస్థాన్ మరోసారి తన నిస్సహాయతను చాటుకుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్, తన అత్యంత సన్నిహిత మిత్రదేశం సౌదీ అరేబియా ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. సూడాన్ దేశంతో కుదుర్చుకున్న భారీ రక్షణ ఒప్పందాన్ని పాకిస్థాన్ అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. సుమారు 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు 42 వేల కోట్ల పాకిస్థానీ రూపాయలు) విలువైన ఈ డీల్ క్యాన్సిల్ అవ్వడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అప్పుల కోసం సౌదీ మీద ఆధారపడటమే పాక్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

అసలు ఏం జరిగింది?

సౌదీ అరేబియా సూచన మేరకు సూడాన్‌కు ఆయుధాలు, జెట్ విమానాలను సరఫరా చేసే 1.5 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాన్ని పాకిస్థాన్ రద్దు చేసుకుంది. వాస్తవానికి సూడాన్ సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య గత మూడేళ్లుగా తీవ్ర అంతర్యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం వల్ల సూడాన్ తీవ్ర మానవీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో సూడాన్ సైన్యానికి ఆయుధాలు అమ్మాలని పాక్ భావించింది. అయితే, ఈ ఒప్పందానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు సౌదీ అరేబియా నిరాకరించడమే కాకుండా, ఈ డీల్ నుంచి తప్పుకోవాలని పాకిస్థాన్‌కు గట్టిగా చెప్పింది.

సౌదీ మాట దాటలేని స్థితిలో పాక్

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విదేశీ రుణాల మీద, ముఖ్యంగా సౌదీ అరేబియా ఇచ్చే బిలియన్ డాలర్ల లోన్ల మీద ఆధారపడి ఉంది. గత ఏడాది రెండు దేశాల మధ్య కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం ఒకరిపై దాడి జరిగితే ఇద్దరిపై జరిగినట్టే భావిస్తారు. ఇంతటి లోతైన సంబంధం ఉన్నప్పుడు, అప్పులిచ్చే సౌదీ మాటను పాక్ కాదనలేదు. సూడాన్ అంతర్యుద్ధంలో ఏ పక్షానికి మద్దతు ఇవ్వాలో పాశ్చాత్య దేశాలు సౌదీకి ఇచ్చిన సలహాల వల్ల రియాద్ తన వ్యూహాన్ని మార్చుకుంది. దీనివల్ల పాక్ ఆశించిన 42 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆవిరైపోయింది.

ప్రక్క దేశాల ప్రమేయం

ఆఫ్రికా ఖండంలోని సూడాన్ ఇప్పుడు విదేశీ ప్రయోజనాల యుద్ధభూమిగా మారింది. సౌదీ అరేబియా సూడాన్ అధికారిక సైన్యానికి మద్దతు ఇస్తుండగా, యూఏఈ మాత్రం ప్రత్యర్థి వర్గమైన ఆర్ఎస్ఎఫ్‎కు సహకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికాలోని ప్రాక్సీ వార్స్ కు దూరంగా ఉండాలని పాశ్చాత్య దేశాలు సౌదీని హెచ్చరించాయి. దీని ప్రభావంతోనే మార్చి నెలలో జరిగిన భేటీ తర్వాత సూడాన్ డీల్ కు నిధులు ఆపేయాలని సౌదీ నిర్ణయించింది. కేవలం సూడాన్ మాత్రమే కాదు, లిబియా నేషనల్ ఆర్మీతో కుదుర్చుకోవాలనుకున్న 4 బిలియన్ డాలర్ల డీల్ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడింది.

పాకిస్థాన్ కు భారీ నష్టం

గత ఏడాది భారత్ తో జరిగిన కొన్ని సరిహద్దు ఘర్షణల తర్వాత పాక్ తన యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థల మార్కెటింగ్ ను పెంచింది. సూడాన్ వంటి దేశాలతో డీల్స్ కుదుర్చుకుని డాలర్లు సంపాదించాలని చూసింది. కానీ, సౌదీ అరేబియా తన వ్యూహాన్ని మార్చుకోవడం పాక్ కు పెద్ద దెబ్బ. సొంతంగా నిధులు సమకూర్చుకోలేని స్థితిలో ఉన్న పాకిస్థాన్, ఇప్పుడు వేల కోట్ల లాభాన్ని వదులుకోవడమే కాకుండా అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో తన విశ్వసనీయతను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News