PAN Card : పాన్ కార్డ్ నిబంధనల్లో పెను మార్పులు..ఇల్లు, కారు కొనేవారికి కేంద్రం బంపర్ ఆఫర్

ఇల్లు, కారు కొనేవారికి కేంద్రం బంపర్ ఆఫర్

Update: 2026-02-11 05:24 GMT

PAN Card : కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. సామాన్యులకు ఊరటనిస్తూ, పన్ను నిబంధనలను మరింత ఆచరణాత్మకంగా మార్చేందుకు డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026 పేరుతో కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం పాన్ కార్డ్ అవసరమయ్యే లావాదేవీల పరిమితుల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. కారు కొనాలన్నా, ఇల్లు అమ్మాలన్నా లేదా హోటల్ బిల్లు కట్టాలన్నా ఇకపై నిబంధనలు మారనున్నాయి.

ప్రస్తుతం బ్యాంకులో ఒకే రోజులో రూ.50 వేలకు మించి నగదు జమ చేసినా లేదా విత్ డ్రా చేసినా పాన్ కార్డు తప్పనిసరిగా చూపించాలి. అయితే డ్రాఫ్ట్ రూల్స్ 2026 ప్రకారం, ఈ పరిమితిని మార్చబోతున్నారు. ఇకపై రోజువారీ లావాదేవీల కంటే ఏడాది మొత్తం మీద చేసే లావాదేవీలనే పరిగణనలోకి తీసుకుంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం నగదు లావాదేవీలు రూ.10 లక్షలు దాటితేనే పాన్ కార్డు అడుగుతారు. దీనివల్ల చిన్న వ్యాపారులకు, రైతులకు ప్రతిసారీ పాన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

ఇప్పటివరకు వాహనం ఏదైనా, ధర ఎంతైనా సరే పాన్ కార్డు కంపల్సరీగా ఉండేది. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం, వాహనం ధర రూ.5 లక్షల లోపు ఉంటే పాన్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే చిన్న కార్లు, బైక్ ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభం కానుంది. కేవలం ఖరీదైన లగ్జరీ కార్లు కొనేవారు మాత్రమే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

మీరు హోటల్ లో బస చేసినప్పుడు లేదా పెళ్లిళ్లు, పార్టీల కోసం బ్యాంక్వెట్ హాళ్లను బుక్ చేసుకున్నప్పుడు ప్రస్తుతం రూ.50 వేలు దాటితే పాన్ కార్డు అడుగుతున్నారు. కొత్త రూల్స్ ప్రకారం ఈ పరిమితిని రూ.లక్షకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల సామాన్యులు తమ ఇంట్లో చిన్న చిన్న శుభకార్యాలు చేసుకున్నప్పుడు పాన్ కార్డు చిక్కులు ఉండవు.

ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసేటప్పుడు ప్రస్తుతం రూ.10 లక్షల విలువైన ఆస్తికి పాన్ కార్డు తప్పనిసరి. కొత్త నిబంధనల ప్రకారం ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచబోతున్నారు. దీనివల్ల చిన్న పట్టణాలు, గ్రామాల్లో జరిగే చిన్న చిన్న ప్రాపర్టీ డీల్స్ కు పాన్ కార్డు అవసరం ఉండదు. పెద్ద ఎత్తున జరిగే బ్లాక్ మనీ లావాదేవీలపై కన్నేస్తూనే, సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.

ఈ ప్రతిపాదనలు ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్ లోనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత వీటిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఇవి అమల్లోకి వస్తే 2026 ఏప్రిల్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది డిజిటల్ ఎకానమీని ప్రోత్సహిస్తూనే, అనవసరమైన పేపర్ వర్క్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News