UPI : సంచలనం.. ఇకపై యూపీఐ పేమెంట్‌కు మ్యూచువల్ ఫండ్‌ను వాడవచ్చు

ఇకపై యూపీఐ పేమెంట్‌కు మ్యూచువల్ ఫండ్‌ను వాడవచ్చు

Update: 2025-10-23 07:46 GMT

UPI : ఇకపై మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను నేరుగా యూపీఐ పేమెంట్స్ కోసం ఉపయోగించవచ్చు. ఆర్థిక ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురానున్న పే విత్ మ్యూచువల్ ఫండ్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సౌకర్యంతో పెట్టుబడిదారులు తమ లిక్విడ్ ఫండ్ హోల్డింగ్స్‌ను ఉపయోగించి నేరుగా చెల్లింపులు చేయవచ్చు. తద్వారా అవసరమైన యూనిట్లను తక్షణమే రిడీమ్ చేసి, ఆ డబ్బు యూపీఐ ద్వారా దాదాపు తక్షణం బదిలీ అవుతుంది. ఇది లిక్విడ్ ఫండ్స్‌ను సేవింగ్స్ ఖాతా లాగా వాడుకునే అవకాశం కల్పిస్తుంది.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన పే విత్ మ్యూచువల్ ఫండ్ ఫీచర్ ద్వారా, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు తమ డబ్బును నేరుగా యూపీఐ చెల్లింపులకు ఉపయోగించవచ్చు. మీ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ద్వారా యూపీఐ పేమెంట్ చేసినప్పుడు, మీరు చెల్లించాలనుకుంటున్న మొత్తానికి సరిపడా ఫండ్ యూనిట్లు తక్షణమే రిడీమ్ అవుతాయి. ఆ డబ్బు దాదాపు తక్షణం యూపీఐ ద్వారా అవతలి వ్యక్తికి బదిలీ అవుతుంది. ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీలు క్యూరీ మనీ సంస్థతో కలిసి ఈ సదుపాయాన్ని ప్రారంభించాయి.

ఈ కొత్త సదుపాయం, పెట్టుబడిదారులకు అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. లిక్విడ్ ఫండ్స్ షార్ట్-టర్మ్ మనీ మార్కెట్ సాధనాలలో పెట్టుబడి పెడతాయి. ఈ ఫీచర్ ద్వారా డబ్బును ముందుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాల్సిన అవసరం లేకుండా, నేరుగా చెల్లింపులు చేయవచ్చు. సాధారణ సేవింగ్స్ ఖాతాపై 4% కంటే తక్కువ వడ్డీ లభిస్తుండగా, లిక్విడ్ ఫండ్‌లు సుమారు 7% వరకు రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. దీంతో డబ్బును లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టి, అవసరమైనప్పుడు వాడుకుంటూ ఎక్కువ రాబడి పొందవచ్చు. నేటి రోజుల్లో చాలా మంది యూపీఐని రోజువారీ చెల్లింపుల కోసం వాడుతున్నారు. ఇప్పుడు లిక్విడ్ ఫండ్‌ను నేరుగా వాడుకునే అవకాశం రావడం వల్ల, ఎలాంటి అదనపు యాప్ లేకుండా, సులభంగా డబ్బును తీసుకోవడం లేదా చెల్లింపులు చేయడం వీలవుతుంది.

వ్యక్తిగత వినియోగదారులు, వ్యాపారాలు రెండూ తమ షార్ట్-టర్మ్ ఫండ్స్‌ను లిక్విడ్ ఫండ్‌లలో ఉంచి, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. అనేక సందర్భాల్లో ఇది మెరుగైన ప్రత్యామ్నాయం అయినప్పటికీ, కొన్ని ముఖ్య విషయాలను గుర్తుంచుకోవాలి. సేవింగ్స్ ఖాతా చాలా సురక్షితమైనది, తక్షణ లిక్విడిటీని ఇస్తుంది. ఇందులో రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. రిటర్న్ స్థిరంగా ఉంటుంది.

లిక్విడ్ ఫండ్‌లు ఎక్కువ రాబడిని ఇచ్చే అవకాశం ఉన్నా, ఇందులో కొంత రిస్క్ ఉంటుంది. అత్యవసర నిధుల కోసం కొంత డబ్బును సేవింగ్స్ ఖాతాలో ఉంచి, అదనపు డబ్బును మాత్రం ఈ ఫీచర్ ద్వారా లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించే ముందు పెట్టుబడిదారులు కొన్ని విషయాలపై క్లారిటీ కలిగి ఉండాలి. మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్ సగటు రాబడి, డబ్బును రిడీమ్ చేసుకునే విధానం గురించి తెలుసుకోవాలి. లిక్విడ్ ఫండ్‌లకు ట్యాక్స్ నిబంధనలు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా సేవింగ్స్ ఖాతా తరహాలోనే వర్తిస్తాయి. మీ పెట్టుబడి, రోజువారీ లిక్విడిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ చెల్లింపుల కోసం ఎంత మొత్తాన్ని ఉపయోగించవచ్చో స్పష్టంగా నిర్ణయించుకోవాలి.

Tags:    

Similar News