Rupee : డాలర్‎కు షాక్.. రూపాయికి రెక్కలు.. ఏకంగా 13 పైసలు పెరిగిన భారత కరెన్సీ

ఏకంగా 13 పైసలు పెరిగిన భారత కరెన్సీ

Update: 2025-10-23 07:45 GMT

Rupee : భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే ఆశలు మళ్లీ చిగురించడంతో భారత కరెన్సీ రూపాయిలో గురువారం (అక్టోబర్ 23) ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బలం కనిపించింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏకంగా 13 పైసలు బలపడి, 87.80 స్థాయికి చేరుకుంది. విదేశీ పెట్టుబడులు పెరగడం, దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ఉండటం కూడా రూపాయి బలం పుంజుకోవడానికి కారణమయ్యాయి. ఈ వాణిజ్య ఒప్పందంపై పెరుగుతున్న అంచనాలు, డాలర్‌కు రూపాయి గట్టి పోటీ ఇవ్వడానికి ఎలా తోడ్పడిందో వివరంగా తెలుసుకుందాం.

గురువారం ఉదయం జరిగిన ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రూపాయి ఏకంగా 13 పైసలు బలపడి, డాలరుకు రూ.87.80 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సోమవారం నాడు రూపాయి డాలరుకు రూ.87.93 వద్ద ముగిసింది. మంగళవారం, బుధవారం దీపావళి పండుగల కారణంగా విదేశీ మారక మార్కెట్ మూతపడింది.

ఫారెక్స్ ట్రేడర్ల ప్రకారం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరవచ్చనే ఆశలు రూపాయి బలం పుంజుకోవడానికి ప్రధాన కారణం. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, దేశీయ స్టాక్ మార్కెట్ల సానుకూలత కూడా దీనికి తోడ్పడింది. భారత కరెన్సీ బలోపేతం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన కీలక పాత్ర పోషించింది. అధ్యక్షుడు ట్రంప్, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ క్రమంగా తగ్గిస్తుందని ప్రకటన చేసిన తర్వాత, వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కావచ్చనే అంచనాలను మార్కెట్ పెట్టుకుంది. వాణిజ్య ఒప్పందం కుదిరినట్లయితే, ప్రస్తుతం ఉన్న 50 శాతం అమెరికా సుంకాలలో దాదాపు 16 శాతం వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సానుకూల అంచనా రూపాయికి మద్దతుగా నిలిచింది.

రూపాయి బలోపేతంతో పాటు, దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా అద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో ఏకంగా 734.36 పాయింట్లు పెరిగి 85,160.70 స్థాయికి చేరుకుంది. అదేవిధంగా, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ-50 కూడా 198.3 పాయింట్ల లాభంతో 26,066.90 స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.64 శాతం పెరిగి 64.24డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం, మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికరంగా రూ.96.72 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇది మార్కెట్‌కు బలాన్ని ఇచ్చింది.

Tags:    

Similar News