LIC : ఎల్‌ఐసీ ప్రీమియం కట్టడానికి డబ్బుల్లేవా? టెన్షన్ వద్దు..మీ పీఎఫ్ ఖాతాతో పని పూర్తి

మీ పీఎఫ్ ఖాతాతో పని పూర్తి

Update: 2026-01-06 07:16 GMT

LIC : జీవిత బీమా పాలసీ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఉండే అతిపెద్ద టెన్షన్.. ప్రీమియం కట్టాల్సిన సమయానికి చేతిలో డబ్బులు ఉంటాయా లేదా అని.. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రీమియం కట్టలేక పాలసీని మధ్యలోనే ఆపేస్తుంటారు. అయితే, మీరు ఉద్యోగం చేస్తూ పీఎఫ్ ఖాతా కలిగి ఉంటే.. ఇకపై ప్రీమియం గురించి అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. మీ జేబులోంచి రూపాయి తీయకుండానే, మీ పీఎఫ్ ఖాతా నుంచే ఎల్‌ఐసీ ప్రీమియం కట్టే అద్భుతమైన సదుపాయం ఒకటి అందుబాటులో ఉంది.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన సభ్యుల కోసం ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించే సదుపాయాన్ని పారా 68(బిబి) కింద కల్పిస్తోంది. అయితే దీనికి కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి. మొదటిది మీ పీఎఫ్ ఖాతాలో కనీసం రెండు నెలల జీతానికి సమానమైన బ్యాలెన్స్ ఉండాలి. రెండోది, మీరు కట్టాలనుకుంటున్న ఎల్‌ఐసీ పాలసీ కేవలం మీ పేరు మీద (సెల్ఫ్) మాత్రమే ఉండాలి. భార్య, పిల్లల పేరు మీద ఉన్న పాలసీలకు ఈ పీఎఫ్ నిధులను వాడుకోవడానికి వీల్లేదు. అలాగే ఈ సదుపాయం కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీకి మాత్రమే వర్తిస్తుంది, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇది వర్తించదు.

ఒకప్పుడు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. మీ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్‌తో ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి ఫామ్-14 నింపాల్సి ఉంటుంది. మీ ఎల్‌ఐసీ పాలసీ వివరాలను అక్కడ నమోదు చేసి, కేవైసీ పూర్తి చేస్తే మీ పీఎఫ్ ఖాతా మీ పాలసీతో లింక్ అవుతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ పూర్తయితే, ఇక ప్రతి ఏటా ప్రీమియం తేదీ రాగానే మీ పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయి ఎల్‌ఐసీకి వెళ్ళిపోతాయి. దీనివల్ల పెనాల్టీలు పడతాయన్న భయం ఉండదు, పాలసీ ల్యాప్స్ అయ్యే ఛాన్సే లేదు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ సదుపాయం ఒక వరం లాంటిదే. బయట అప్పులు చేయకుండా లేదా పాలసీని మధ్యలో ఆపేయకుండా ఇది కాపాడుతుంది. అయితే దీనివల్ల ఒక చిన్న నష్టం కూడా ఉంది. పీఎఫ్ అనేది మీ రిటైర్మెంట్ కోసం దాచుకునే సొమ్ము. ప్రీమియం కోసం ఆ డబ్బును వాడుకోవడం వల్ల మీ భవిష్యత్తు నిధి తగ్గుతుంది. పీఎఫ్ మీద వచ్చే చక్రవడ్డీ లాభాన్ని మీరు కోల్పోతారు. అందుకే ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పుడు మాత్రమే దీనిని ఒక బ్యాకప్ ప్లాన్ లాగా వాడుకోవాలని, అలవాటుగా మార్చుకోవద్దని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

Tags:    

Similar News