Gold Tax: భారతీయ కుటుంబాల్లో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక ముఖ్యమైన పెట్టుబడి సాధనం. ఏళ్ల క్రితం వేల రూపాయలకు కొనుగోలు చేసిన బంగారం విలువ ఇప్పుడు లక్షల రూపాయలకు చేరుకుంది. అయితే పాత నగల స్థానంలో కొత్త నగలు తీసుకునేటప్పుడు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి నోటీసులు రావులే అని చాలామంది భావిస్తుంటారు. కానీ ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం బంగారాన్ని మూలధన ఆస్తిగా గుర్తిస్తారు. కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువ ధరకు పాత బంగారాన్ని విక్రయించినా లేదా ఎక్స్ఛేంజ్ చేసినా వచ్చిన లాభంపై పన్ను చెల్లించడం తప్పనిసరి.

వ్యక్తిగత వాడకం కింద మినహాయింపు ఉందా?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2(14) ప్రకారం బంగారు ఆభరణాలను వ్యక్తిగత వినియోగ పరిధి నుంచి మినహాయించారు. దీని ప్రకారం మీరు సొంత అవసరాల కోసం ఆభరణాలను కొనుగోలు చేసినప్పటికీ, వాటిని విక్రయించినప్పుడు లేదా ఎక్స్ఛేంజ్ చేసినప్పుడు వచ్చే లాభంపై పన్ను వర్తిస్తుంది. పాత బంగారాన్ని దుకాణదారుడికి ఇవ్వడం ద్వారా పొందే విలువను ఐటీ శాఖ అమ్మకంతో సమానంగానే పరిగణిస్తుంది. కొనుగోలు చేసిన ధర, ఇప్పటి విక్రయ ధర మధ్య ఉన్న తేడాను లాభంగా పరిగణించి పన్ను వేస్తారు.

అమ్మకం, కొనుగోలు రెండూ వేర్వేరు లావాదేవీలే

చాలామంది పాత నగలు ఇచ్చి అదే షాప్‌లో కొత్త నగలు తీసుకుంటున్నాం కదా, పన్ను ఎందుకు కట్టాలని అనుకుంటారు. కానీ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పాత బంగారం అమ్మకం, కొత్త బంగారం కొనుగోలు అనేవి రెండు వేర్వేరు లావాదేవీలు. అందుకే పాత ఆభరణాల అమ్మకం ద్వారా వచ్చిన మూలధన లాభం (క్యాపిటల్ గెయిన్స్) పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బంగారం ఉంచుకున్న కాలాన్ని బట్టి స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల కింద పన్ను వర్తిస్తుంది.

నోటీసులు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాత నగలు ఎక్స్ఛేంజ్ చేసే సమయంలో జువెలర్స్ నుంచి కచ్చితంగా బిల్లులు లేదా రసీదులు తీసుకోవడం ముఖ్యం. పాత బంగారం కొనుగోలు చేసిన నాటి బిల్లులు ఉంటే లాభాన్ని సరిగ్గా లెక్కించడం సులభమవుతుంది. అలాగే పెద్ద మొత్తంలో నగదు రూపంలో మార్పిడి లావాదేవీలు జరపకుండా బ్యాంకు రికార్డులు ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం. ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేటప్పుడు ఈ లాభాలను సరిగ్గా నమోదు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు.

Tags: