New Toll Policy : కొత్త రూల్ వచ్చేసింది.. ఇక నుంచి హైవే పై ఎంత దూరం వెళ్తే అంతే టోల్ ట్యాక్స్
ఇక నుంచి హైవే పై ఎంత దూరం వెళ్తే అంతే టోల్ ట్యాక్స్;
New Toll Policy :హైవేల మీద ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఓ అదిరిపోయే శుభవార్త చెప్పబోతోంది. దేశవ్యాప్తంగా త్వరలో కొత్త టోల్ పాలసీని అమలు చేయనున్నారు. దీని వల్ల మీరు హైవేపై ఎంత దూరం వెళ్తే అంతే దూరానికి టోల్ ట్యాక్స్ కట్టాలి. ఇది ప్రయాణికులకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ఈ కొత్త టోల్ పాలసీ రాబోయే వారం లేదా పది రోజుల్లో అమలులోకి రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత టోల్ వసూలు విధానాన్ని మరింత పారదర్శకంగా, సులభంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
ఎంత దూరం వెళ్తే అంతే కట్టాలి!
కొత్త పాలసీలోని అతి ముఖ్యమైన మార్పు ఇదే. ఇప్పుడు వాహనదారులు తాము ప్రయాణించిన దూరాన్ని బట్టి మాత్రమే టోల్ చెల్లించాలి. అంటే, మీరు ఎక్స్‌ప్రెస్‌వే లేదా జాతీయ రహదారిని కేవలం 10 కిలోమీటర్ల దూరం ఉపయోగించినా ఆ 10 కిలోమీటర్లకే టోల్ కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల తక్కువ దూరం ప్రయాణించే వారు కూడా ఇంతకాలం మొత్తం టోల్ స్లాబ్‌కు డబ్బులు కట్టాల్సిన బాధ తప్పుతుంది. ఇది చిన్న దూరం వెళ్లే ప్రయాణికులకు నిజంగా పెద్ద ఉపశమనం.
ఫాస్టాగ్, కెమెరాలతో టోల్ వసూలు
కొత్త టోల్ విధానంలో ప్రతి టోల్ బూత్ వద్ద అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. మీ ఫాస్టాగ్ ద్వారా మీ బ్యాంకు ఖాతా నుండి టోల్ మొత్తం ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల టోల్ ప్లాజాల వద్ద ఉండే పొడవైన లైన్లు, ట్రాఫిక్ జామ్‌లు పూర్తిగా తగ్గుతాయి. అంతేకాదు టోల్ దొంగతనాలు, మోసాలకు కూడా అడ్డుకట్ట పడుతుంది.
ఖర్చు, సమయం ఆదా
ఈ కొత్త టోల్ పాలసీ ప్రస్తుత విధానం కంటే మరింత పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. టోల్ మొత్తం నేరుగా వాహన యజమాని ఖాతా నుండి కట్ అవ్వడం వల్ల డబ్బు లావాదేవీలు, తగాదాలు ఉండవు. దీని వల్ల ప్రయాణికులు పదేపదే టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం కూడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త అడుగు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, ట్రాఫిక్ జామ్‌లను, పెట్రోల్/డీజిల్ వృథాను, సమయం వృథాను కూడా తగ్గిస్తుంది. ఈ కొత్త టోల్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హైవేలపై ప్రయాణించడం గతంలో కంటే చాలా వేగంగా, మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆశిస్తున్నారు.