PhonePe IPO : ఫోన్‌పే ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..ఇన్వెస్టర్లకు కాసుల వేట షురూ
ఇన్వెస్టర్లకు కాసుల వేట షురూ
PhonePe IPO : ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే త్వరలో భారతీయ స్టాక్ మార్కెట్లను షేక్ చేయబోతోంది. అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్ మద్దతు ఉన్న ఈ కంపెనీ ఐపీఓకు సెబీ అనుమతి లభించింది. ఇది దేశంలోని అతిపెద్ద ఫిన్‌టెక్ ఐపీఓలలో ఒకటిగా నిలవనుంది. సుమారు 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12,500 కోట్లు) సేకరించడమే లక్ష్యంగా ఫోన్‌పే ఈ ఇష్యూని తీసుకురాబోతోంది. అయితే, ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో ఉండబోతోంది. అంటే మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్, టైగర్ గ్లోబల్ వంటి పాత ఇన్వెస్టర్లు తమ వాటాలను కొంత మేర అమ్మి సొమ్ము చేసుకోనున్నారు. 2025 చివరలో జరిగిన ఫండింగ్ ప్రకారం ఫోన్‌పే విలువ సుమారు 14.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
2015లో చిన్నగా మొదలైన ఫోన్‌పే ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా అల్లుకుపోయింది. ప్రస్తుతం దీనికి 43.5 కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. అంటే మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు ఫోన్‌పే వాడుతున్నారన్నమాట. నగరాలనే కాకుండా టైర్-2, టైర్-3 పట్టణాల్లోని సుమారు 3.5 కోట్ల మంది చిరు వ్యాపారులను కూడా ఈ ప్లాట్‌ఫామ్ తన నెట్‌వర్క్‌లోకి చేర్చుకుంది. ప్రస్తుతం దేశంలోని 99 శాతం పిన్‌కోడ్లలో ఫోన్‌పే సేవలు అందుబాటులో ఉన్నాయంటే దీని విస్తృతి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం యూపీఐ పేమెంట్లే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక సేవల రంగాల్లో కూడా కంపెనీ దూసుకుపోతోంది.
ఆర్థికంగా చూస్తే ఫోన్‌పే నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం రూ.1,727 కోట్లకు తగ్గింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం మాత్రం 40 శాతం పెరిగి రూ.7,115 కోట్లకు చేరింది. భారతదేశం బిల్ పేమెంట్ సిస్టమ్‌లో ఫోన్‌పే దాదాపు 45 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం. కేవలం డిసెంబర్ 2025 నెలలోనే కంపెనీ ఏకంగా 9.8 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ఇప్పుడు పక్కా ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్‌గా మారి ఇన్వెస్టర్ల ముందుకు వస్తోంది.
ఈ ఐపీఓ బాధ్యతలను కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ వంటి దిగ్గజ బ్యాంకులు పర్యవేక్షిస్తున్నాయి. సెబీ అనుమతి వచ్చింది కాబట్టి, మార్కెట్ పరిస్థితులను బట్టి కంపెనీ త్వరలోనే ఐపీఓ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. పేమెంట్స్ రంగంలో గట్టి పట్టున్న కంపెనీ కావడం, నష్టాలు తగ్గుతూ ఆదాయం పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఈ ఐపీఓ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. సామాన్యులకు కూడా ఫోన్‌పే షేర్ల ద్వారా లాభాలు పొందే సువర్ణావకాశం ఇది.