PM Kisan : రైతన్నలకు పండగే..పీఎం కిసాన్ నిధుల్లో భారీ పెంపు?
పీఎం కిసాన్ నిధుల్లో భారీ పెంపు?
PM Kisan : దేశంలోని కోట్లాది మంది రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించబోతోంది. సాగు ఖర్చుల కోసం చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా నిలుస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. రైతులు తమ 22వ విడత డబ్బుల కోసం వేచి చూస్తుండగా, మరోవైపు ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి బడ్జెట్‌లో రైతులకు ఇచ్చే నగదు సాయాన్ని పెంచుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
బడ్జెట్ కేటాయింపుల్లో పెరుగుదల - ఇదే సంకేతమా?
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను చూస్తుంటే, పీఎం కిసాన్ నిధులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) తొలుత రూ.60,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, రైతుల సంఖ్య పెరగడంతో దాన్ని రూ.63,500 కోట్లకు పెంచింది. గత రెండేళ్లలో బడ్జెట్ కేటాయింపులు సుమారు రూ.2,000 కోట్లకు పైగా పెరగడం గమనార్హం. అర్హులైన ప్రతి రైతుకు పైసా కూడా ఆగకుండా నేరుగా ఖాతాల్లోకి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని దీని ద్వారా స్పష్టమవుతోంది.
రూ. 6,000 కాస్తా పెరగనుందా?
ప్రస్తుతం రైతన్నలకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 సాయం అందుతోంది. అయితే పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు, సాగు ఖర్చుల దృష్ట్యా ఈ మొత్తాన్ని పెంచాలని రైతులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బులు జమ అవుతుండటంతో ఈ పథకం రైతులకు వరంగా మారింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ వార్షిక సాయాన్ని రూ.8,000 లేదా రూ.9,000కు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫిబ్రవరి 1పైనే అందరి కళ్లు
వ్యవసాయ శాఖ ప్రతిపాదనల ప్రకారం.. రాబోయే ఎన్నికలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి నిధుల పంపిణీలో పారదర్శకత పాటిస్తూ వస్తున్నారు. 2023-24లోనే ప్రభుత్వం రూ. 61,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగడంతో, రైతుల కోసం బడ్జెట్‌లో ఏదో ఒక పెద్ద గిఫ్ట్ దాగి ఉందని అంతా నమ్ముతున్నారు. అదే గనుక జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతల ఇళ్లలో సంక్రాంతి ముందే వచ్చినంత సందడి నెలకొంటుంది.