PM Surya Ghar: పీఎం మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ సంచలనం.. దేశంలో 56 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్
ఉచిత విద్యుత్
PM Surya Ghar: పెరిగిన కరెంట్ బిల్లుల భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూ పీఎమ్ సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 56 లక్షల కుటుంబాలు తమ ఇంటి కప్పులపై సోలార్ ప్లాంట్లు అమర్చుకుని ఉచిత కరెంట్ పొందుతూ కరెంట్ బిల్లును పూర్తిగా సున్నా చేసుకోగలిగాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా సామాన్యుడు కేవలం విద్యుత్ కొనుగోలుదారుడిగా మాత్రమే కాకుండా స్వయంగా ఉత్పాదకుడిగా మారుతున్నాడు. గుజరాత్ లోని వడోదరాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయమై ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటివరకు 55.82 లక్షలకు పైగా కుటుంబాలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయని కొనియాడారు. కేవలం గుజరాత్‌లోనే 11.77 లక్షల కుటుంబాలు సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తూ ఈ పథకం ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందుకుంటున్నాయి.
యువతకు ఉపాధి మార్గాలు, కొత్త స్టార్టప్‌లు
ఈ పథకం కేవలం గృహ వినియోగదారుల బిల్లులు తగ్గించడానికే పరిమితం కాలేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి రంగానికి పెద్ద ఊతాన్నిస్తోంది. సోలార్ ప్యానెళ్ల తయారీ నుంచి వాటిని ఇళ్లపై బిగించడం, తదనంతర నిర్వహణ సేవల వరకు వేలాది కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి. అనేకమంది యువకులు ఈ రంగంలో సర్వీస్ ప్రొవైడర్లుగా, వెండర్లుగా మారి స్వయం ఉపాధి పొందుతున్నారు. సోలార్ రంగంలో సరికొత్త స్టార్టప్‌లు వెలిసిల్లి మార్కెట్‌లో మంచి పురోగతి సాధిస్తున్నాయి.
గుజరాత్ రికార్డు.. వేల కోట్ల సబ్సిడీ రవాణా
ఈ ఉచిత విద్యుత్ ఉద్యమంలో గుజరాత్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 8. 33 లక్షలకు పైగా సోలార్ ప్లాంట్లు విజయవంతంగా అమర్చారు. వీటి ద్వారా సుమారు 3,123 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. లబ్ధిదారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏకంగా రూ.6,030 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసింది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సోలార్ ప్యానెళ్ల పట్ల ఆసక్తి మరింత పెరిగింది.
నేషనల్ గ్రిడ్‌కు భారీగా జతవుతున్న విద్యుత్
జాతీయ స్థాయిలో ఈ పథకం ఓ విప్లవాత్మక మార్పుకు దారితీసింది. దేశమంతటా ఇప్పటికే 46 లక్షల 94 వేలకు పైగా ప్లాంట్ల ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయింది. దీని ఫలితంగా నేషనల్ గ్రిడ్‌కు అదనంగా 16,530 మెగావాట్లకు పైగా సౌర విద్యుత్ సామర్థ్యం తోడైంది. బొగ్గు ఆధారిత విద్యుత్ పై భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఎంతో దోహదపడుతోంది. ప్రతినెలా వేల రూపాయల కరెంట్ బిల్లులు ఆదా అవుతుండటంతో మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతోంది.