IT Stocks: ఐటీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ గండం.. ఒక్క రోజే స్టాక్ మార్కెట్లో రూ.55,000 కోట్లు ఆవిరి
రూ.55,000 కోట్లు ఆవిరి
IT Stocks: అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం భారత ఐటీ రంగాన్ని తీవ్రంగా కుదిపేసింది. దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌కు చెందిన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్(పర్మ్) ప్రక్రియను నిలిపివేస్తూ అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ ఐటీ షేర్ల మార్కెట్ విలువ ఏకంగా రూ. 55,000 కోట్లు క్షీణించింది. అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో తెలిపిన వివరాల ప్రకారం.. కాగ్నిజెంట్ సంస్థకు సంబంధించి పర్మ్ సర్టిఫికేషన్ ఫైలింగ్స్ సస్పెండ్ అయ్యాయి. విదేశీ ఉద్యోగులకు ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయడానికి ఈ పర్మ్ ప్రక్రియ అత్యంత కీలకం. కాగ్నిజెంట్ లో సాగుతున్న మోసపూరిత వ్యవహారాలు, అమెరికన్ ఉద్యోగులకు జరిగే నష్టాలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వైట్ హౌస్ యాంటీ ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఈ విచారణ చేపడుతుండటంతో ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. క్లౌడేరా అనే మరో సంస్థపై కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నారు.
నష్టాల్లో కూరుకుపోయిన ఐటీ దిగ్గజాలు
అమెరికా నుంచి వచ్చిన ఈ వార్త దలాల్ స్ట్రీట్‌ను వణికించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ షేర్లు 3 శాతానికి పైగా నష్టపోగా.. టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు కూడా 3 శాతం వరకు పతనమయ్యాయి. ప్రముఖ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ షేర్లు 2 శాతం వరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగ్నిజెంట్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ, ఎక్కువ మంది ఉద్యోగులు భారతదేశం నుంచి సేవలు అందిస్తున్నారు. ఈ రకమైన నిషేధం ఇతర ఐటీ కంపెనీల ఫైలింగ్స్‌పై కూడా ప్రభావం చూపుతుందనే భయాలు ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేశాయి.
స్థానిక ఉద్యోగుల నియామకం చేపట్టినా తప్పని తిప్పలు
విచిత్రమేమిటంటే.. ఈ చర్యలకు సరిగ్గా ఒక్క రోజు ముందే కాగ్నిజెంట్ అమెరికాలో స్థానిక ఉద్యోగాల కల్పనపై కీలక ప్రకటన చేసింది. దాదాపు 1,500 మంది అమెరికన్ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి ఫ్రంటియర్ వర్క్‌ఫోర్స్‌ను 15,000 కు పెంచనున్నట్లు సిఈఓ రవికుమార్ ఎస్ ప్రకటించారు. ఐటీ రంగంలో ఎంతమంది స్థానికులను చేర్చుకున్నా, విదేశీ నిపుణుల అవసరం నిరంతరం ఉంటుంది. పర్మ్ సర్టిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోవడం వల్ల ఆయా ఉద్యోగుల గ్రీన్ కార్డ్ డ్రీమ్ నెరవేరడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
హెచ్-1బి వర్సెస్ పర్మ్ సర్టిఫికేషన్ వ్యత్యాసం
చాలామంది హెచ్-1బి వీసా, పర్మ్ సర్టిఫికేషన్ రెండూ ఒకటే అని భావిస్తారు. పర్మ్ అనేది శాశ్వత ప్రాతిపదికన అమెరికాలో నివసించేందుకు గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియలో భాగం. హెచ్-1బి వీసాలు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు అనుమతిస్తాయి. పర్మ్ ఫైలింగ్స్ నిలిపివేత వల్ల హెచ్-1బి పిటిషన్లపై నేరుగా ప్రభావం పడకపోయినా, దీర్ఘకాలికంగా అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ ఐటీ ఉద్యోగులకు ఇది కోలుకోలేని దెబ్బ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.