PNB Account : పీఎన్‌బీ ఖాతాదారులకు లాస్ట్ వార్నింగ్.. ఏప్రిల్ 15 లోపు ఇది చేయకుంటే మీ అకౌంట్ ఖాళీ

ఏప్రిల్ 15 లోపు ఇది చేయకుంటే మీ అకౌంట్ ఖాళీ

Update: 2026-03-18 07:02 GMT

PNB Account : పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. చాలా కాలంగా లావాదేవీలు జరపకుండా పక్కన పడేసిన ఖాతాల విషయంలో బ్యాంక్ కఠిన నిర్ణయం తీసుకుంది. అటువంటి ఖాతాదారులు వెంటనే తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని, లేనిపక్షంలో ఒక నెలలోపు వారి ఖాతాలను శాశ్వతంగా మూసివేస్తామని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన బ్యాంక్, ఏప్రిల్ 15, 2026 లోపు కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని గడువు విధించింది. ఒకవేళ ఆ లోపు స్పందించకపోతే, ఏప్రిల్ 16 నుంచి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే అకౌంట్లను క్లోజ్ చేస్తామని వెల్లడించింది.

అసలు ఇన్-ఆపరేటివ్ అకౌంట్ అంటే ఏమిటో చాలామందికి తెలియదు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఏదైనా సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌లో వరుసగా రెండేళ్లపాటు ఎటువంటి డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్ జరగకపోతే, దానిని బ్యాంక్ పనిచేయని ఖాతాగా గుర్తిస్తుంది. ఇలాంటి ఖాతాలను మళ్ళీ వాడుకోవాలంటే కేవైసీ అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ఖాతాదారులు నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లేదా ఆన్‌లైన్ ద్వారా, వీడియో కేవైసీ సౌకర్యం ఉంటే ఇంటి నుంచే ఈ పని పూర్తి చేయవచ్చు. అప్పుడే మీ అకౌంట్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది.

కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఖాతాదారులు తమ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, తాజా ఫోటోలతో హోమ్ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. బయోమెట్రిక్ కేవైసీ పూర్తయిన వారు ఏ బ్రాంచ్‌లోనైనా ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాతా మళ్ళీ యాక్టివ్ కావాలంటే కేవలం డబ్బులు జమ చేయడం లేదా తీయడమే కాకుండా.. బ్యాలెన్స్ చెక్ చేయడం, చెక్ బుక్ కోసం అప్లై చేయడం వంటి పనులు చేసినా సరిపోతుంది. ఆ తర్వాత యథావిధిగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని బ్యాంక్ అధికారులు తెలిపారు.

మరోవైపు, బ్యాంకులు పెనాల్టీల రూపంలో భారీగా సంపాదిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా తేలిపోయింది. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు గాను హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, పీఎన్‌బీ బ్యాంకులు అత్యధికంగా జరిమానాలు వసూలు చేశాయి. తాజాగా లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత మూడేళ్లలో ఏకంగా రూ.8,092.83 కోట్లు పెనాల్టీల రూపంలో ఖాతాదారుల నుంచి వసూలు చేసినట్లు వెల్లడైంది. కాబట్టి మీ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోవడంతో పాటు, అది యాక్టివ్‌గా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Tags:    

Similar News