Post Office Rules 2026 : ఇకపై ప్రతి లావాదేవీకి పాన్ తప్పనిసరి.. పోస్టాఫీసు కొత్త రూల్స్ ఇవే
పోస్టాఫీసు కొత్త రూల్స్ ఇవే
Post Office Rules 2026 : పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్నవారికి లేదా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి భారత ప్రభుత్వం షాకింగ్ న్యూస్ అందించింది. ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026లో భాగంగా పోస్టాఫీసు లావాదేవీలపై నిబంధనలను కేంద్రం మరింత కఠినతరం చేసింది. ఇకపై ప్రతి చిన్న పనికి కూడా పాన్ కార్డ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ పాన్ లేకపోతే ఏం చేయాలి? కొత్తగా వచ్చిన ఫారాలు ఏంటి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పాన్ కార్డు లేకపోతే పనవ్వదు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ప్రకారం.. పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్స్‌లో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా కొత్త మార్పులు చేశారు. ఇకపై కొత్తగా ఖాతా తెరవాలన్నా, డబ్బులు జమ చేయాలన్నా, విత్ డ్రా చేసుకోవాలనుకున్నా లేదా టైమ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలన్నా పాన్ కార్డ్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి. పెద్ద ఎత్తున జరిగే నగదు లావాదేవీలను ట్రాక్ చేయడానికి, పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రభుత్వం రూల్స్ 159, 160, 161, 211, 237 కింద ఈ మార్పులు చేసింది.
పాన్ లేని వారికి ఫామ్ 97
ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించింది. గతంలో వాడే ఫామ్ 60 స్థానంలో ఇప్పుడు ఫామ్ 97 తీసుకువచ్చారు. పాన్ లేని వారు ఈ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఇందులో మీ గుర్తింపు, చిరునామా, లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాలి. దీనివల్ల పాన్ లేకపోయినా మీ లావాదేవీలు ఐటి రికార్డుల్లో నమోదవుతాయి.
టీడీఎస్ కోసం కొత్త ఫామ్ 121
ఇప్పటివరకు పన్ను మినహాయింపు కోసం 60 ఏళ్ల లోపు వారు ఫామ్ 15G, సీనియర్ సిటిజన్లు ఫామ్ 15H వాడేవారు. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపేసి ప్రభుత్వం ఫామ్ 121 అనే కొత్త ఫారాన్ని ప్రవేశపెట్టింది. వయస్సుతో సంబంధం లేకుండా ఆదాయం పన్ను పరిధిలోకి రాని వారందరూ ఈ ఒక్క ఫామ్ ద్వారా టీడీఎస్ మినహాయింపు కోరవచ్చు. ఈ ఫామ్ ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఫామ్ ఇవ్వకపోతే మీ ఆదాయంపై బ్యాంక్ లేదా పోస్టాఫీసు నేరుగా టీడీఎస్ కట్ చేస్తుంది.
రికార్డుల భద్రత, ప్రస్తుత పరిస్థితి
కొత్త నిబంధనల ప్రకారం.. పోస్టాఫీసు అధికారులు కస్టమర్లు సమర్పించే డాక్యుమెంట్లను కనీసం 7 ఏళ్ల పాటు భద్రపరచాలి. దీనివల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా పన్ను విచారణ జరిగితే రికార్డులను సులభంగా తనిఖీ చేయవచ్చు. అయితే, ప్రస్తుతం పోస్టాఫీసుల్లో సిస్టమ్ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతున్నందున, తాత్కాలికంగా పాత ఫారాలను (15G, 15H) కూడా అంగీకరిస్తున్నారు. కానీ త్వరలోనే పూర్తిస్థాయిలో కొత్త సిస్టమ్ అమల్లోకి రానుంది. కాబట్టి కస్టమర్లు తమ పాన్ వివరాలను పోస్టాఫీసు ఖాతాకు ముందే అనుసంధానించుకోవడం మంచిది.