Dollar Vs Rupee : రూపాయి పతనానికి బ్రేక్.. ప్రపంచ దేశాలు విస్మయపోయేలా ఆర్‌బీఐ సంచలన నిర్ణయం
ప్రపంచ దేశాలు విస్మయపోయేలా ఆర్‌బీఐ సంచలన నిర్ణయం
Dollar Vs Rupee : అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ ధాటికి భారత రూపాయి విలవిలలాడుతోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు మన కరెన్సీపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ ఒక పాత బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. విదేశీ భారతీయుల నుంచి పెద్ద ఎత్తున డాలర్లను ఆకర్షించేందుకు ఎఫ్‌సీఎన్ఆర్(బి)(FCNR-B) డిపాజిట్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చి మళ్ళీ ప్రారంభించాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మన దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐ డిపాజిట్లలో భారీ క్షీణత కనిపిస్తోంది. గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2025 నుంచి జనవరి 2026 మధ్య ఎన్ఆర్ఐ డిపాజిట్లు సుమారు 26 శాతం పడిపోయాయి. గతంలో 7 బిలియన్ డాలర్లకు పైగా ఉన్న ఎఫ్‌సీఎన్ఆర్(బి) డిపాజిట్లు ఇప్పుడు కేవలం 1 బిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడిపోవడం ఆర్‌బీఐని ఆందోళనకు గురిచేస్తోంది. విదేశీ మారక నిల్వలు తగ్గితే రూపాయి విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ స్కీమ్‌ను మళ్ళీ ఆకర్షణీయంగా మార్చి, విదేశీ కరెన్సీని దేశంలోకి రప్పించాలని ఆర్‌బీఐ భావిస్తోంది.
ఎఫ్‌సీఎన్ఆర్(బి) అంటే ఏమిటి? దీని వల్ల లాభమేంటి?
ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) లేదా ఎఫ్‌సీఎన్ఆర్(బి) అనేది ఒక ప్రత్యేకమైన డిపాజిట్ పథకం. ఇందులో విదేశాల్లో ఉండే భారతీయులు తమ సంపాదనను డాలర్లు, పౌండ్లు లేదా యూరోల రూపంలోనే భారతీయ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. దీని వల్ల ప్రయోజనం ఏంటంటే.. కరెన్సీ మార్పిడి వల్ల వచ్చే నష్ట భయం ఇన్వెస్టర్లకు ఉండదు. దేశానికి నేరుగా డాలర్లు వస్తాయి కాబట్టి రూపాయికి బలం పెరుగుతుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. రాబోయే మానిటరీ పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
2013 నాటి సక్సెస్ ఫార్ములాను మళ్ళీ వాడతారా?
ఇదే తరహా పరిస్థితి 2013లో కూడా ఎదురైంది. అప్పట్లో రూపాయి విలువ దారుణంగా పడిపోతున్నప్పుడు అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ ఎఫ్‌సీఎన్ఆర్(బి) స్కీమ్ ద్వారా డాలర్ స్వ్యాప్ విండోను తెరిచారు. ఆ సమయంలో బ్యాంకుల ద్వారా సుమారు 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. అది రూపాయిని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో బ్యాంకులకు కొన్ని రాయితీలు ఇచ్చి, ఎన్ఆర్ఐల నుంచి డాలర్లను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో ఈసారి ఈ ప్రక్రియ కొంచెం ఖర్చుతో కూడుకున్నది కావచ్చు.
యుద్ధ సెగ.. రూపాయికి కష్టకాలం
పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ ఇప్పటికే 10 శాతం వరకు బలహీనపడింది. దిగుమతులు ఖరీదైనవిగా మారడం, చమురు ధరలు పెరగడం వల్ల కరెన్సీపై ఒత్తిడి పెరిగింది. ఒకవేళ ఆర్‌బీఐ ఈ ఎఫ్‌సీఎన్ఆర్(బి) స్కీమ్‌ను విజయవంతంగా అమలు చేస్తే, దేశంలో విదేశీ మారక నిల్వలు మళ్ళీ పుంజుకుంటాయి. దీనివల్ల బ్యాంకుల వద్ద నగదు లభ్యత పెరిగి, అప్పులు ఇచ్చే సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. మొత్తానికి రూపాయిని పతనం నుంచి కాపాడేందుకు ఆర్‌బీఐ తన అమ్ములపొదిలోని పాత అస్త్రాన్ని మళ్ళీ సిద్ధం చేస్తోంది.