RBI Monetary Policy : ఆర్బీఐ సంచలన నిర్ణయం..రెపో రేటులో మార్పు లేదు, లోన్ తీసుకున్న వారికి పెద్ద షాక్

రెపో రేటులో మార్పు లేదు, లోన్ తీసుకున్న వారికి పెద్ద షాక్

Update: 2026-02-06 12:56 GMT

RBI Monetary Policy : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, ద్రవ్యోల్బణ పరిస్థితులను సమీక్షించిన అనంతరం రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. ఫిబ్రవరి 4న ప్రారంభమైన ఈ మూడు రోజుల సమీక్షా సమావేశ విశేషాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు.

ఆర్బీఐ నిర్ణయం ప్రకారం రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగుతుంది. దీనివల్ల బ్యాంకులు ఇచ్చే గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లలో తక్షణమే ఎలాంటి మార్పులు ఉండవు. ఇతర కీలక రేట్లు ఇలా ఉన్నాయి.

* రివర్స్ రెపో రేటు: 3.35%

* స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF): 5%

* మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF): 5.50%

* బ్యాంక్ రేటు: 5.50%

* నగదు నిల్వల నిష్పత్తి (CRR): 3%

* స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (SLR): 18%

జీడీపీ వృద్ధి రేటుపై ఆశాభావం

దేశ ఆర్థిక వృద్ధి రేటు విషయంలో ఆర్బీఐ సానుకూలంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో భారత జీడీపీ 7.4 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. గత సమీక్షలో ఈ అంచనా 7.3 శాతంగా ఉండగా, తాజాగా దాన్ని మరింత పెంచడం విశేషం. పారిశ్రామిక ఉత్పత్తి పెరగడం, వినియోగం పుంజుకోవడం వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. దీనివల్ల భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని పదిలం చేసుకోనుంది.

ద్రవ్యోల్బణంపై నిఘా

నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బీఐ కొంత అప్రమత్తంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం సగటున 2.1 శాతం ఉండవచ్చని లెక్కగట్టింది. గతంలో ఇది 2 శాతం ఉంటుందని భావించినా, ఇప్పుడు స్వల్పంగా పెంచింది. ముఖ్యంగా జనవరి నుండి మార్చి వరకు ఉండే త్రైమాసికంలో ధరల పెరుగుదల 3.2 శాతం వరకు వెళ్లవచ్చని హెచ్చరించింది. ధరలను అదుపులో ఉంచుతూనే వృద్ధిని కొనసాగించడమే తమ లక్ష్యమని మానిటరీ పాలసీ కమిటీ స్పష్టం చేసింది.

మరోవైపు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం కూడా భారత మార్కెట్ పై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. వెనిజులా వంటి దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటే దేశీయంగా ధరలను నియంత్రించే అవకాశం ఉంటుందని ఆర్బీఐ అభిప్రాయపడింది.

Tags:    

Similar News