RBI MPC Meeting : మీ లోన్ ఇఎంఐలు తగ్గుతాయా? నేడే రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం!

నేడే రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం!

Update: 2026-08-05 05:08 GMT

RBI MPC Meeting : ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల కీలక సమావేశం ఆగస్ట్ 3 సోమవారం నాడు ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశ ఫలితాలను ఆగస్ట్ 5వ తేదీ బుధవారం ఉదయం 10:00 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ పరిస్థితుల మధ్య ఈసారి వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు, రుణగ్రహీతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

రెపో రేటు యథాతథం.. 5.25 శాతంలో మార్పు లేనట్లే

ఆర్థిక నిపుణులు, బ్లూమ్‌బెర్గ్ సర్వే అంచనాల ప్రకారం.. ఆర్బీఐ ఈసారి కూడా రెపో రేటును 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. డిసెంబర్ 2025లో చివరిసారిగా రెపో రేటులో మార్పులు జరగగా నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన వరుస విధాన సమీక్షల్లో వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించారు. ఇటీవల వినియోగదారుల ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినప్పటికీ, అది ఆర్బీఐ విధించిన పరిమితి లోపే ఉండటం వల్ల ప్రస్తుతానికి రెపో రేటును పెంచే ఆలోచన లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.

సమీక్ష వేళలు, యూట్యూబ్ లైవ్ అప్‌డేట్స్

ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఫలితాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఉదయం 10:00 గంటలకు వెల్లడిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:00 గంటలకు జరిగే విలేకరుల సమావేశంలో ఆయన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తారు. ఈ విధాన ప్రకటన అంతా ఆర్బీఐ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. గత జూన్ సమీక్షలో కూడా రెపో రేటును 5.25% వద్ద కొనసాగిస్తూ, న్యూట్రల్ వైఖరిని అవలంబించారు. అలాగే ఎస్‌డీఎఫ్ రేటు 5%, ఎమ్‌ఎస్‌ఎఫ్, బ్యాంక్ రేటును 5.5% వద్దే ఉంచారు.

మార్కెట్ల చూపు అంతా ద్రవ్యోల్బణం, లిక్విడిటీ వ్యాఖ్యలపైనే

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెపో రేటు మార్పు కంటే ద్రవ్యోల్బణం, లిక్విడిటీపై ఆర్బీఐ ఇచ్చే మార్గదర్శకాలపైనే ఇన్వెస్టర్లు ఎక్కువ దృష్టి సారిస్తారు. ముడి చమురు ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశీయ వృద్ధి స్థిరంగా ఉంది. ఆర్బీఐ తన న్యూట్రల్ వైఖరిని కొనసాగిస్తూ, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతామని హామీ ఇస్తే ఫైనాన్షియల్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు వెళ్తాయి. ప్రస్తుతం స్థిరమైన వడ్డీ రేట్లు క్రెడిట్ గ్రోత్, కార్పొరేట్ రంగానికి మద్దతునిస్తాయని, రాబోయే త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణ తీరును బట్టే తదుపరి నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News