RBI: నకిలీ నోట్ల చెలామణికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత సురక్షితమైన ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. సరిహద్దుల అవతల నుంచి జరిగే ఆర్థిక కుట్రలను తిప్పికొడుతూ చైనా, పాకిస్తాన్ దేశాల ఎంట్రీని పూర్తిగా అడ్డుకుంది. భారత కరెన్సీ భద్రతను అత్యంత కీలకంగా భావించిన ఆర్బీఐ, తన అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్(BRBNMPL) ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విడుదల చేసింది. ఈ టెండర్లలో పాల్గొనే సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను చైనా, పాకిస్తాన్‌లతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా వేరుగా ఉంచాలనే కఠిన నిబంధన విధించింది. రహస్య ఒప్పందాలు, సమగ్రతా ఒప్పందాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు సరఫరా చేసే పాలిమర్ షీట్లలో జంతువుల కొవ్వు లేదా వాటి డీఎన్ఏ ఏమాత్రం ఉండకూడదని స్పష్టం చేసింది. గతంలో బ్రిటన్ లాంటి దేశాల్లో జంతు కొవ్వు వినియోగంపై తలెత్తిన వివాదాలను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

రేసులో నిలిచిన అంతర్జాతీయ దిగ్గజాలు

భారత మార్కెట్‌కు పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్లను సరఫరా చేసేందుకు విదేశీ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కరెన్సీ నోట్ల తయారీ సంస్థ 'డీ లా రూ'తో కలిసి భారతీయ సంస్థ కాస్మో ఫస్ట్ ఈ రేసులో నిలిచింది. కాస్మో ఫస్ట్ తన సాంకేతిక భాగస్వామి ద్వారా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన ప్లాస్టిక్ షీట్లను ఆర్బీఐకి అందించేందుకు సిద్ధమైంది. బ్రిటన్ సంస్థతో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 సెంట్రల్ బ్యాంకులకు పాలిమర్ నోట్లను సరఫరా చేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన సీసీఎల్ సెక్యూర్ సంస్థ కూడా ఈ టెండర్ బిడ్డింగ్‌లో పాల్గొంది.

తొలి విడతగా రూ.10, రూ.20 నోట్ల ముద్రణ

ఆర్బీఐ తొలి విడతగా 68,000 రీమ్‌ల పాలిమర్ సబ్‌స్ట్రేట్‌ను సేకరించనుంది. ప్రతి రీమ్‌లో 500 పాలిమర్ షీట్లు ఉంటాయి. ఈ షీట్ల నమూనాలను దేశంలోని వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించిన తర్వాతే తుది టెండర్‌కు అనుమతిస్తారు. ప్రయోగాత్మకంగా ముందుగా రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తేనున్నారు. సాంప్రదాయ కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఆరు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని, తడిసినా లేదా చిరిగినా కూడా సులువుగా పాడవవని అధికారులు చెప్తున్నారు.

వియత్నాం కంపెనీ సంచలన బిడ్

పాలిమర్ కరెన్సీ రంగంలో సొంతంగా ఎదుగుతున్న వియత్నాంకు చెందిన క్యూర్ అండ్ టీ హైటెక్ పాలిమర్ కంపెనీ కూడా ఈ టెండర్ ప్రక్రియలో భాగస్వామి అయింది. ప్లాస్టిక్ నోట్ల వినియోగం వల్ల కరెన్సీ ముద్రణ లైఫ్‌సైకిల్ ఖర్చు 78 శాతం వరకు తగ్గుతుందని ఈ సంస్థ పేర్కొంటోంది. భారత వాతావరణానికి అనుగుణంగా ఉండే కరెన్సీని అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. కాగితం, పాలిమర్ మిశ్రమంతో కూడిన నోట్లను త్వరలోనే భారతీయుల చేతుల్లో చూడవచ్చు.

Tags: