RBI : డిజిటల్ దొంగలకు చెక్.. యూపీఐ పేమెంట్ల సేఫ్టీ కోసం ఆర్‌బీఐ బ్రహ్మాస్త్రం రెడీ
యూపీఐ పేమెంట్ల సేఫ్టీ కోసం ఆర్‌బీఐ బ్రహ్మాస్త్రం రెడీ
RBI : నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో డిజిటల్ పేమెంట్స్ భాగమైపోయాయి. కిరాణా కొట్టు నుంచి విమాన టికెట్ల వరకు అన్నీ యూపీఐ ద్వారానే జరిగిపోతున్నాయి. అయితే, సౌకర్యం ఎంత పెరిగిందో.. అదే స్థాయిలో సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా పెచ్చుమీరిపోతున్నాయి. ప్రజల కష్టార్జితాన్ని క్షణాల్లో మాయం చేస్తున్న కేటుగాళ్లకు చెక్ పెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక పక్కా ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ మోసాల్లో టెక్నికల్ లోపాల కంటే, ప్రజలను బురిడీ కొట్టించి వాళ్లతోనే పేమెంట్ చేయించుకునే ఆథరైజ్డ్ పేమెంట్ ఫ్రాడ్లే ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఎవరికైనా పంపినప్పుడు, సుమారు ఒక గంట పాటు కూలింగ్ పీరియడ్‌ను ఉంచాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. అంటే మీరు పెద్ద మొత్తం పంపినప్పుడు అది వెంటనే అవతలి వారికి చేరకుండా కొద్దిసేపు నిలిపివేయబడుతుంది. ఒకవేళ మీరు మోసపోతున్నామని గుర్తిస్తే, ఆ గంటలోపు ఆ ట్రాన్సాక్షన్‌ను రద్దు చేసే అవకాశం మీకు ఉంటుంది. అయితే, దుకాణదారులకు చేసే పేమెంట్లకు ఈ నియమం నుంచి మినహాయింపు ఉండవచ్చు.
సైబర్ నేరగాళ్ల వలలో ఎక్కువగా చిక్కుతున్నది సీనియర్ సిటిజన్లేనని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే వృద్ధులు చేసే పెద్ద ట్రాన్సాక్షన్ల విషయంలో అదనపు భద్రతా తనిఖీలను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ యోచిస్తోంది. ఫోన్ కాల్స్, డీప్‌ఫేక్ వీడియోలు లేదా నకిలీ యాప్‌ల ద్వారా జరిగే మోసాలను అడ్డుకోవడంలో ఈ పద్ధతి కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఒత్తిడికి లోనై డబ్బులు పంపించినా, ఈ కూలింగ్ పీరియడ్ వల్ల ఆ డబ్బును రికవరీ చేసే అవకాశాలు మెరుగుపడతాయి.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ వెల్లడించిన గణాంకాలు చూస్తే భయం వేస్తుంది. 2021లో కేవలం 2.6 లక్షల కేసులు నమోదవ్వగా, వాటి విలువ రూ. 551 కోట్లు. కానీ 2025 నాటికి ఈ కేసులు ఏకంగా 28 లక్షలకు చేరుకున్నాయి. మోసపోయిన సొమ్ము రూ. 22,931 కోట్లు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నిమిషానికి ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు. ఈ భారీ నష్టాన్ని ఆపడమే లక్ష్యంగా ఆర్‌బీఐ తాజా చర్చాపత్రాన్ని విడుదల చేసింది.
ఈ కొత్త నిబంధనల వల్ల డిజిటల్ పేమెంట్లలో వేగం కొద్దిగా తగ్గొచ్చు, కానీ భద్రత మాత్రం వంద శాతం పెరుగుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ ప్రతిపాదనలపై ఆర్‌బీఐ ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలను కోరింది. సామాన్యుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తుది నిబంధనలను రూపొందిస్తారు. రాబోయే రోజుల్లో మన డిజిటల్ లావాదేవీలు మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మారబోతున్నాయి. అంటే, ఆన్‌లైన్ పేమెంట్ అంటే భయం లేని రోజులు త్వరలోనే రానున్నాయి.