RBI Repo Rate Cut : ఆర్బీఐ రేటు హ్యాట్రిక్ కోత ఖాయం? వడ్డీ రేట్లు తగ్గింపుతో సామాన్యులకు ఊరట

Update: 2025-06-03 01:52 GMT

RBI Repo Rate Cut : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున రేట్లను తగ్గించిన ఆర్బీఐ ఈసారి ఏకంగా 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. అదే జరిగితే, రెపో రేటు 6శాతం నుంచి 5.50శాతానికి దిగిరావచ్చు.

జూన్ 4న ప్రారంభం

వడ్డీ రేట్లను తగ్గించాలా వద్దా అనేది రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) నిర్ణయిస్తుంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ కమిటీ సమావేశం జరుగుతుంది. అక్కడ రెపో రేటుతో పాటు ఇతర చర్యల సమీక్ష జరుగుతుంది. ఈసారి ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం జూన్ 4న ప్రారంభమవుతుంది. రెండు రోజుల చర్చల అనంతరం జూన్ 6, శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తారు.

50 బేసిస్ పాయింట్ల వడ్డీ కోతతో ప్రయోజనం ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా అస్థిర ఆర్థిక వాతావరణం నెలకొంది. దీనిని ఎదుర్కోవడానికి ఎక్కువ వడ్డీ రేట్ల తగ్గింపు అవసరం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జూన్ నెల సమావేశంలో 50 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపును ఆశిస్తున్నామని ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధనా విభాగం అభిప్రాయపడింది. ఇతర సంస్థలు, వ్యక్తుల అంచనాల్లో కొద్దిగా తేడా ఉంది. చాలా మంది 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. గత రెండేళ్లుగా 6.50శాతం ఉన్న వడ్డీ రేటును ఆర్‌బీఐ ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.00శాతం వద్దకు తీసుకువచ్చింది. ఇప్పుడు అది 5.75శాతానికి తగ్గుతుందా లేక 5.50శాతానికి తగ్గుతుందా అనేది వేచి చూడాలి.

బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం

ఒకవేళ ఆర్‌బీఐ 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును తగ్గిస్తే, బ్యాంకుల రుణ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బ్యాంకుల రుణాలలో 60శాతం EBLR (External Benchmark Lending Rate)తో లింక్ అయి ఉన్నాయి. 36శాతం రుణాలు MCLR (Marginal Cost of Funds based Lending Rate)తో లింక్ అయి ఉన్నాయి. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు EBLR తో లింక్ అయిన రుణాల రేట్లు త్వరగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణాలు తీసుకునే వినియోగదారులకు వడ్డీ రేటును తగ్గించాలా లేదా అనేది బ్యాంకుల విచక్షణకు వదిలివేసినా, ఆర్‌బీఐ రెపో రేటు ఒక విధంగా బ్యాంకుల నిర్ణయానికి ప్రమాణంగా ఉంటుంది.

Tags:    

Similar News