Loan Recovery: రికవరీ ఏజెంట్ల గుండాగిరీకి ఇక చెక్.. జనవరి 1, 2027 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్
జనవరి 1, 2027 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్
Loan Recovery: ఇల్లు, వాహనం లేదా మెడికల్ ఎమర్జెన్సీ కోసం లోన్ తీసుకున్న వారు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఈఎమ్‌ఐ చెల్లించకపోతే రికవరీ ఏజెంట్ల నుంచి ఎదురయ్యే వేధింపులకు స్వస్తి పలికేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రికవరీ పేరుతో బ్యాంకు ఏజెంట్లు కస్టమర్లను భయభ్రాంతులకు గురిచేయడం, బూతులు తిట్టడం, ఆఫీసుల వద్ద గొడవ చేయడం వంటి చర్యలను అరికట్టేందుకు ఆర్‌బీఐ నూతన నిబంధనలను ఖరారు చేసింది. రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ డైరెక్టోరియల్స్ కింద రూపొందించిన ఈ కొత్త నిబంధనలు 1 జనవరి 2027 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఏజెంట్ వివరాలు, ఐఐబీఎఫ్ శిక్షణ తప్పనిసరి
బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్లను నియమించుకునే ముందు కస్టమర్లకు వారి వివరాలను ముందస్తుగా తెలియజేయడం ఇప్పుడు తప్పనిసరి. ఏజెంట్ మారినా లేదా కాంట్రాక్ట్ రద్దయినా ఆ సమాచారాన్ని కస్టమర్‌కు అందించాలి. రికవరీకి అవసరమైనంత సమాచారాన్ని మాత్రమే ఏజెంట్‌కు ఇవ్వాలి. డాటాను తప్పుగా ఉపయోగిస్తే బ్యాంక్‌పై భారీ జరిమానాలు విధిస్తారు. అంతేకాకుండా రికవరీ రంగంలో పనిచేసే ప్రతి ఏజెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(IIBF) నుంచి తగిన శిక్షణ పొంది సర్టిఫికేషన్ సాధించడం తప్పనిసరి చేశారు.
సమయపాలన, రికార్డెడ్ కాల్స్ నిబంధన
ఇకపై రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లకు ఫోన్ చేయడం లేదా నేరుగా కలవడం చేయాలి. కస్టమర్ స్వయంగా అనుమతిస్తే తప్ప మిగిలిన వేళల్లో సంప్రదించకూడదు. ఫోన్ లో మాట్లాడే ప్రతి సంభాషణను రికార్డ్ చేయాలని, కాల్ రికార్డ్ అవుతున్న విషయాన్ని కస్టమర్‌కు ముందే చెప్పాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ రికార్డింగ్‌లను కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి. రుణగ్రహీతల బంధువులు, స్నేహితులు, ఆఫీస్ సహచరులకు ఫోన్ చేసి వేధించడం, సోషల్ మీడియాలో డిఫాల్టర్ల వివరాలను పోస్ట్ చేయడంపై పూర్తిగా నిషేధం విధించారు.
ఫోన్ లాకింగ్ వ్యవస్థపై కఠిన ఆంక్షలు, పరిహారం
ఫైనాన్స్‌లో స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసి ఈఎమ్‌ఐ బౌన్స్ అయిన వెంటనే ఫైనాన్స్ కంపెనీలు ఫోన్‌లను లాక్ చేసే పద్ధతికి ఆర్‌బీఐ చెక్ పెట్టింది. ఈఎమ్‌ఐ బౌన్స్ అయిన 30 రోజుల తర్వాత మాత్రమే ఫోన్‌లో కొన్ని పరిమితులు విధించవచ్చు. పూర్తిగా బ్లాక్ చేసే హక్కు 60 రోజుల తర్వాత మాత్రమే ఉంటుంది. ఫోన్ బ్లాక్ చేసినప్పటికీ ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్, అత్యవసర సేవలు ఆగిపోకూడదు. లోన్ బకాయిలు చెల్లించిన 1 గంటలోపు ఫోన్‌ను అన్‌లాక్ చేయాలి. ఆలస్యమైతే గంటకు రూ. 250 చొప్పున బ్యాంక్ లేదా కంపెనీ కస్టమర్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటికి వస్తే ఐడీ కార్డ్, అథరైజేషన్ లెటర్ ఉండాల్సిందే
ఏజెంట్లు ఇల్లు లేదా ఆఫీస్‌కు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఐడీ కార్డ్ ధరించాలి. దాంతో పాటు బ్యాంక్ జారీ చేసిన అథరైజేషన్ లెటర్, నోటీస్ కాపీని చూపించాలి. కస్టమర్లు ఫిర్యాదు చేసేందుకు వీలుగా గ్రీవెన్స్ రీడ్రెసల్ ఆఫీసర్ నంబర్‌ను కూడా అందించాలి. ఈ మార్పుల ద్వారా రికవరీ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ నిబంధనల అమలును బ్యాంకులు సులభంగా పర్యవేక్షించవచ్చని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.