RBI : ఆర్‌బీఐ మాస్టర్ ప్లాన్.. మార్కెట్లోకి రూ.2 లక్షల కోట్లు..తీరనున్న బ్యాంకుల కష్టాలు
తీరనున్న బ్యాంకుల కష్టాలు
RBI : బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరతను తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడుం బిగించింది. మార్కెట్లోకి ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా నగదును విడుదల చేయాలని నిర్ణయించింది. వివిధ ఆర్థిక మార్గాల ద్వారా ఈ నిధులను సిస్టమ్ లోకి పంపిణీ చేయడం ద్వారా బ్యాంకుల దగ్గర తగినంత లిక్విడిటీ ఉండేలా చూడాలన్నదే ఆర్‌బీఐ ప్లాన్. బడ్జెట్ కు ముందు ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక రంగంలో పెను మార్పులకు నాంది పలకనుంది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నగదు కొరతను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన అనంతరం, సుమారు రూ.2,16,000 కోట్లను సిస్టమ్‌లోకి చేర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జనవరి 30న రూ.25,000 కోట్ల విలువైన 90 రోజుల వేరియబుల్ రేట్ రెపో వేలాన్ని నిర్వహించనుంది. అలాగే, ఫిబ్రవరి 4న 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91,000 కోట్లు) విలువైన అమెరికన్ డాలర్/ఇండియన్ రూపాయి స్వాప్ వేలాన్ని నిర్వహించి నగదు లభ్యతను పెంచనుంది.
కేవలం వేలంపాటల ద్వారానే కాకుండా..ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ప్రభుత్వం నుంచి బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా కూడా నగదును మార్కెట్లోకి పంపిస్తోంది. ఫిబ్రవరి 5, 12 తేదీల్లో రెండు విడతలుగా ఒక్కోసారి రూ.50,000 కోట్ల చొప్పున మొత్తం లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను ఆర్‌బీఐ కొనుగోలు చేయనుంది. ఇలా చేయడం వల్ల బాండ్లను అమ్మిన బ్యాంకుల దగ్గరకు భారీగా నగదు చేరుతుంది, తద్వారా సామాన్యులకు లేదా పరిశ్రమలకు అప్పులు ఇచ్చే సామర్థ్యం పెరుగుతుంది.
బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థికవేత్తలు చాలా కాలంగా ఆర్‌బీఐని ఈ విషయంలో కోరుతున్నారు. మార్కెట్లో నగదు కొరత ఉంటే బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి వెనకాడుతాయని, దానివల్ల దేశ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన సమావేశాల్లో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విదేశీ మారక మార్కెట్లో ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం వల్ల కొంత నగదు కొరత ఏర్పడగా, తాజా నిధుల విడుదలతో ఆ లోటు భర్తీ కానుంది.
ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. ఫిబ్రవరిలో జరిగే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును తగ్గించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ తర్వాత, ఫిబ్రవరి 6న ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం), కొత్త జీడీపీ లెక్కల కోసం ఆర్‌బీఐ వేచి చూసే అవకాశం ఉంది. ఏదేమైనా వ్యవస్థలోకి రూ.2 లక్షల కోట్ల నగదు ప్రవాహం రాబోతుండటం బ్యాంకింగ్ రంగానికి ఒక గొప్ప ఊరట అని చెప్పవచ్చు.