RBI MPC Meeting : ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభం..రెపో రేటు తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా?

రెపో రేటు తగ్గుతుందా, స్థిరంగా ఉంటుందా?

Update: 2025-12-03 14:07 GMT

RBI MPC Meeting : మీరు ఇంటి లోన్ లేదా కారు లోన్ తీసుకున్నారా ? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశం ఈ రోజు, అంటే డిసెంబర్ 3, బుధవారం నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 5 వరకు జరిగే ఈ మూడు రోజుల సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన రెపో రేటు పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయం మీ EMI తగ్గుతుందా లేదా అనేది తేలుస్తుంది. అయితే, రెపో రేటు తగ్గింపుపై ఆర్థిక నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రముఖ క్రెడిట్ రేటింగ్ కంపెనీ ఎస్‌బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక, రెపో రేటు తగ్గింపుపై ఉత్కంఠను పెంచింది. కొద్ది రోజుల క్రితం వరకు, ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తుందని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే ఆ అవకాశం కనిపించడం లేదని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి బలంగా ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందున, రెపో రేటులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని నివేదిక అంచనా వేసింది. ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు కూడా తమ రెపో రేట్లను స్థిరంగా ఉంచుతున్నాయని, కాబట్టి ఆర్బీఐ కూడా అదే వైఖరిని కొనసాగించవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ అభిప్రాయపడింది.

మరోవైపు, క్రెడిట్ రేటింగ్ కంపెనీ కేర్‌ఎడ్జ్ నివేదిక ప్రకారం.. రెపో రేటు తగ్గింపుకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెలలో దేశ ద్రవ్యోల్బణం పది సంవత్సరాల కనిష్ఠ స్థాయి అయిన 0.3 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యం కంటే ఇది చాలా తక్కువ. ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం, జీడీపీ వృద్ధి బలంగా ఉండటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని, ఆర్బీఐ 0.25 శాతం రెపో కట్‌ను ప్రకటించే అవకాశం ఉందని కేర్‌ఎడ్జ్ నివేదిక అంచనా వేసింది. ఒకవేళ రెపో రేటు తగ్గితే అది బ్యాంకుల వడ్డీ రేట్లను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, ఇతర రుణాలపై EMIలు తగ్గే అవకాశం ఉంటుంది.

రెపో రేటు అంటే ఏమిటి?

సాధారణంగా, రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకునేటప్పుడు చెల్లించాల్సిన వడ్డీ రేటు. ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు, బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు పొందుతాయి. దీంతో ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తూ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. దీనివల్ల లోన్ తీసుకున్న వారి EMI భారం తగ్గుతుంది. ఒకవేళ ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచితే, మీ EMI లలో ఎలాంటి మార్పు ఉండదు.

Tags:    

Similar News