Anil Ambani : అనిల్ అంబానీకి మరో షాక్..RComను 'ఫ్రాడ్'గా ప్రకటించిన SBI

RComను 'ఫ్రాడ్'గా ప్రకటించిన SBI;

Update: 2025-07-04 12:40 GMT

Anil Ambani : భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోన్ అకౌంట్‌ను ఫ్రాడ్ గా ప్రకటించింది. కంపెనీ తీసుకున్న రుణ మొత్తాన్ని తప్పుదోవ పట్టించి ఇతర కంపెనీలకు బదిలీ చేసిందని, అలాగే ఇంటర్-కంపెనీ లావాదేవీలు, అమ్మకాలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లను దుర్వినియోగం చేసిందని బ్యాంక్ ఆరోపించింది. ఈ విషయాలను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దాఖలు చేసిన ఒక లేఖలో SBI వెల్లడించింది. ఇప్పుడు బ్యాంక్, RCom, దాని మాజీ ప్రమోటర్ అనిల్ అంబానీ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించి తదుపరి చర్యలు తీసుకోనుంది.

ఈ ప్రకటన తర్వాత, అనిల్ అంబానీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీకి చెందిన అగర్వాల్ లా అసోసియేట్స్ ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది ఏకపక్ష నిర్ణయం అని పేర్కొంది. 2024 అక్టోబర్ 21న తాము బ్యాంకుకు లేఖ రాశామని, 2023 డిసెంబర్ 20న SBI జారీ చేసిన షోకాజ్ నోటీసు చెల్లదని అందులో తెలిపినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఎందుకంటే 2024 జూలై 15న RBI జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు, పాత మార్గదర్శకాలన్నింటినీ రద్దు చేశాయి. కాబట్టి, బ్యాంక్ SCNను వెనక్కి తీసుకోవాల్సిందని అగర్వాల్ లా అసోసియేట్స్ వాదించింది. దాదాపు ఒక సంవత్సరం పాటు SBI నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, బ్యాంక్ తమ వాదనను అంగీకరించిందని, ఇకపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోదని అనిల్ అంబానీ విశ్వసించారని ఆ న్యాయ సంస్థ తెలిపింది.

అగర్వాల్ అసోసియేట్స్ ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించింది. SBI ఇచ్చిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ అసంపూర్ణంగా ఉందని, పూర్తి డాక్యుమెంట్లు అందించలేదని, దీనివల్ల అంబానీ సరిగా సమాధానం చెప్పలేకపోయారని పేర్కొంది. అంతేకాకుండా, ఈ విషయంలో వ్యక్తిగత విచారణకు కూడా అవకాశం ఇవ్వలేదని ఫిర్యాదు చేసింది. SBI తన నోటీసులో, ప్రమోటర్‌ను మోసగాడిగా ప్రకటించే ముందు విచారణకు అవకాశం ఇవ్వాలని 2023 మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొంది. దాని ప్రకారమే బ్యాంక్ గతంలో ఇచ్చిన ఫ్రాడ్ ట్యాగ్‌ను తొలగించి, 2023 డిసెంబర్ 20, 2024 మార్చి, 2024 సెప్టెంబర్‌లో కంపెనీ, దాని ప్రమోటర్లకు కొత్త నోటీసులు పంపిందని వివరించింది.

జనవరి 2024లో, రిజల్యూషన్ ప్రొఫెషనల్ నుంచి కూడా బ్యాంకుకు ఒక సమాధానం అందింది. అందులో పాత డైరెక్టర్లు లేదా ఉద్యోగుల పై మోసం ఆధారంగా చర్యలు తీసుకోవడానికి SBIకి పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొంది. SBI కన్నా ముందు కెనరా బ్యాంక్ కూడా RComను మోసంగా ప్రకటించింది. లోన్ మొత్తాన్ని అనుసంధానిత పార్టీలకు పంపడం, ఇంటర్-కంపెనీ లావాదేవీలు వంటి కారణాలను కెనరా బ్యాంక్ కూడా పేర్కొంది. RCom, దాని అనుబంధ కంపెనీలు బ్యాంకుల నుంచి మొత్తం రూ.31,580 కోట్లు రుణాలను తీసుకున్నాయి.

Tags:    

Similar News